Universities VC: ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఉన్నత విద్యాశాఖ విషయంలో ఆశ్చర్యపరిచేలా అనేక నిర్ణయాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్రంలో ఐదు విశ్వవిద్యాలయాలకు ఒకేసారి వీసీలను నియమించింది ప్రభుత్వం. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి ఓ వెనుకబడిన వర్గానికి చెందిన ప్రొఫెసర్ కు వైస్ ఛాన్స్లర్ పదవి దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల వీసీలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఇందులో తొమ్మిది యూనివర్సిటీలకు సంబంధించి గత ఫిబ్రవరిలోనే ప్రభుత్వం వాయిస్ ఛాన్స్లర్లను నియమించింది. అయితే యోగివేమన విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన పనితి ప్రకాష్ బాబు కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీగా అవకాశం రావడంతో రాజీనామా చేసి వెళ్లిపోయారు. దీంతో 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా ఐదు యూనివర్సిటీలకు వీసీలను నియమించింది ఏపీ ప్రభుత్వం.
* విజయనగరంలోని జేఎన్టీయూ గురజాడ వైస్ ఛాన్స్లర్గా డాక్టర్ వెంకట సుబ్బారావును నియమించింది. ఈయన బీసీల్లో అత్యంత వెనుకబడిన రజక వర్గానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన కాకినాడ జేఎన్టీయూలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన 15 సంవత్సరాలుగా అధ్యాపక వృత్తిలో ఉన్నారు.
* ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీగా ఎస్ వి ఎస్ రాజు నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని బందా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్, టెక్నాలజీ విసిగా ఉన్నారు. గతంలో వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ కు డైరెక్టర్ గా పని చేశారు.
* తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విసిగా తాతా నర్సింగరావు నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ ఐఐటి విభాగంలో పరిశోధనా సలహాదారుడుగా ఉన్నారు.
* కడప యోగివేమన యూనివర్సిటీ వీసీగా రాజశేఖర్ బెల్లంకొండ నియమితులయ్యారు. బిజినెస్ మేనేజ్మెంట్లో అపార అనుభవం ఉంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్గా ఉండేవారు.
* కడపలోని డాక్టర్ వైయస్సార్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం వీసీగా జయరామిరెడ్డి నియమితులయ్యారు. యోగివేమన యూనివర్సిటీలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.