TDP Janasena First List: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి దూకుడు పెంచాయి. వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా టీడీపీ-జనసేన కూటమిలో సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. బీజేపీ ఇంకా ఎటు తేల్చలేదు. అయినా టీడీపీ-జనసేన కూటమి శనివారం టిక్కెట్లు ప్రకటించాయి. మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇందులో 94 టీడీపీ, 24 జనసేనకు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో చర‍్చనీయాంశమైంది.
పవన్‌కు న్యాయం.. కాపులకు అన్యాయం..
తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై హాట్ కామెంట్స్ వస్తున్నాయి. కూటమితో పవన్‌కు న్యాయం జరిగిందని, ఆయనను నమ్ముకున్న కాపులకు అన్యాయం జరిగిందని పలువురు విమర్శిస్తున్నారు. 24 సీట్లతో పవన్ ఎలా యుద్ధం చేస్తాడని ప్రశ్నిస్తున్నారు. జన సేనానిపై కాపులు మండి పడుతున్నారు. చంద్రబాబు నైజాని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేస్తున్నారు. పైకి ఎన్ని నీతులు చెప్పినా.. ఫైనల్‌గా తమ పార్టీకి లబ్ధి చేకూరేలా బాబు ఆడిన మైండ్‌గేమ్‌లో పవన్ చిత్తయ్యాడని పలువురు పేర్కొంటున్నారు.
అభ్యర్థులూ కరువే..
ఇక పొత్తులో టీడీపీ తనకు వచ్చిన 94 స్థానాలకు అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. జనసేన అధినేత పవన్ మాత్రం తన పార్టీకి ఇచ్చిన 24 సీట్లకు అభ్యర్థులను ప్రకటించలేకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. కేవలం 5 సీట‍్లకే అభ్యర్థులను ప్రకటించారు. మిగతా 19 స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారో చెప్పలేదు. అంటే ఆ 24 స్థానాలకు కూడా అభ్యర్థులు లేరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మిగిలిన 57 సీట్ల విషయానికి వస్తే టీడీపీ, జనసేన వీటిని ఎలా పంచుకుంటాయి అన్న చర్చ కూడా జరుగుతోంది. అసలు ఇస్తారా, ఇంతటితోనే సరిపెడతారా అన‍్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక తెలుగు దేశం పార్టీ ప్రకటించిన సీట్లలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు, సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు, లోకేష్, బాలకృష్ణ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. జనసేన ప్రకటించిన ఐదుగురిలో ఒక్క పేరు కూడా ప్రముఖులది లేదు. మరోవైపు పవన్ ఇప్పటికీ తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో డిసైడ్ కాలేదు.
మొత్తంగా పవన్ కళ్యాణ్ పొత్తుకు సిద్ధమై.. చంద్రబాబుకు తలొగ్గారని జన సైనికులే విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ జనసేనకు అండగా నిలిచినవారు కూడా పొత్తుల తీరుపై పెదవి విరుస్తున్నారు.