TDP Janasena First List: గడిచిన ఎన్నికల్లో జనసేన 130 స్థానాల్లో పోటీ చేసింది.. ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జనసేన ఒక్క స్థానం మాత్రమే గెలుచుకున్నప్పటికీ ఏపీలో అధికారాన్ని తారుమారు చేసే బలాన్ని మాత్రం కూడదీసుకుంది. అలాంటి జనసేన నేడు 24 స్థానాలకు పడిపోయింది. మూడు పార్లమెంటు స్థానాలతో సరిపెట్టుకుంది. సొంత సామాజిక వర్గం నాయకులు హెచ్చరిస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ 175 స్థానాలకు కనీసం పావు శాతం కూడా డిమాండ్ చేయకుండా కేవలం 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాలకు ఓకే చెప్పడం పట్ల సొంత పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 స్థానాలకు గానూ శనివారం అప్పటికప్పుడు ఐదు స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించిన నేపథ్యంలో జనసేనాని ఎన్నికలకు పూర్తిస్థాయిలో కసరత్తు చేయలేదని తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై జనసేన నాయకులు పెద్దవి విరుస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని కోరుకున్నప్పటికీ.. దానికి పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తుండడంతో జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, కాపు సామాజిక వర్గం వారికి రాజ్యాధికారం ప్రాప్తించాలని కోరుకుంటే.. ఈ సీట్ల పంపకాలు నిరుత్సాహానికి గురిచేశాయని జనసేన నాయకులు అంటున్నారు. “అభ్యర్థుల పేర్లకు సంబంధించి టిడిపి పకడ్బందీగా జాబితాతో వచ్చింది. పవన్ కళ్యాణ్ మాత్రం అప్పటికప్పుడు తెల్ల పేపర్ మీద నాదెండ్ల మనోహర్ రాస్తే ప్రకటించారు. చంద్రబాబు మరోసారి సహజ నైజాన్ని బయట పెట్టుకున్నారు. చంద్రబాబు బయటికి చెప్పేదొకటి, లోపల చేసేదొకటి.. ఆయన ఎన్ని నీతులు చెప్పినప్పటికీ చివరగా తనకు, తన పార్టీకి లాభం చేకూర్చేలా పొత్తులు పెట్టుకున్నారని” జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు..”ముందు 118 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు.. టిడిపి మాత్రం తెలివిగా 94 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించుకుంది. కానీ పవన్ కళ్యాణ్ ఐదుగురు అభ్యర్థులతోనే సరిపోతారు. ఇచ్చిన 24 సీట్లలో ఇంకా 19 మంది పేర్లు ప్రకటించలేదు. మూడు పార్లమెంటు స్థానాల నుంచి ఎవర్ని పోటీ చేయిస్తారో తెలియదు. అంతా అయోమయంగా ఉందంటూ” జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు సూచించిన అభ్యర్థులనే పవన్ కళ్యాణ్ తన పార్టీ తరఫున పోటీ చేయిస్తున్నారనే అసలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మొదటి విడతను పక్కనపెడితే.. రెండవ విడతలో టిడిపి జనసేన 57 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరి వీటిల్లో జనసేనకు ఎన్ని దక్కుతాయనేది ప్రశ్నార్థకంగా ఉంది. టిడిపి ప్రకటించిన జాబితాలో దాదాపు అగ్ర నాయకుల పేర్లు మొత్తం ఉన్నాయి. కానీ జనసేన ప్రకటించిన జాబితాలో నాదెండ్ల మనోహర్ మినహా మిగతా వారెవరి పేర్లు కనిపించడం లేదు. చివరికి పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడినుంచి పోటీ చేస్తారో ఒక స్పష్టత లేదు. అంటే దీనిని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో కూడా చంద్రబాబే నిర్ణయిస్తారేమోనని జనసేన నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. తనకు తాను సీటు ప్రకటించుకోలేని స్థితిలో పవన్ కళ్యాణ్ పొత్తుకు సిద్ధమయ్యారని, చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి వీటన్నింటికి పవన్ కళ్యాణ్ ఏ విధంగా సమాధానం చెప్తారో వేచి చూడాల్సి ఉంది.