Fire Accident At Jagan House
Fire Accident At Jagan House : మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) ఇంటి వద్ద కలకలం చోటు చేసుకుంది. నివాసానికి సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఇంటి ఆవరణకు ఆనుకొని ఉన్న మొక్కలు మంటల బారిన పడ్డాయి. గడ్డి కూడా దగ్ధమైంది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అలెర్ట్ అయ్యారు. మంటలను ఆర్పేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో ఇటువంటి అవాంఛనీయ ఘటన జరగడం ఇది మూడోసారి. గతంలో లడ్డు వివాదం నేపథ్యంలో ఇటువంటి ఘటన జరిగింది. బిజెపి యువమోర్చా నాయకులు, కార్యకర్తలు జగన్ నివాసాన్ని ముట్టడించారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వైసిపి కేంద్ర కార్యాలయం పై చెప్పులు కూడా వేశారు. జగన్ దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.
* మంత్రి లోకేష్ జన్మదినం నాడు
మరోవైపు గత నెలలో సైతం ఇటువంటి ఘటన ఒకటి జరిగింది. జనవరి 23న మంత్రి నారా లోకేష్( Nara Lokesh) జన్మదినం. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాయి. అయితే కొందరు కార్యకర్తలు అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు వేడుకలు జరుపుకున్నారు. కార్లు బైకులతో భారీ సంఖ్యలో జగన్ నివాసం వద్దకు చేరుకున్న టిడిపి కార్యకర్తలు హారన్ మోగిస్తూ హల్చల్ చేశారు. టిడిపి కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే అలా చేశారని వైసీపీ ఆరోపించింది. ఈ ఘటనపై మంత్రి లోకేష్ కూడా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి తావు లేదని.. మరోసారి టిడిపి కార్యకర్తలు అటువంటి చర్యలకు పాల్పడవద్దని కూడా హెచ్చరించారు.
* అనేక రకాల అనుమానాలు
అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. వాటిని ఆర్పివేశారు. అయితే ఫైర్ ఇంజన్ సకాలంలో రాకపోవడంతో చెట్టు కొమ్మలతో మంటలను అదుపు చేయడం కనిపించింది. ఒకవైపు మంటలు ఆర్పుతుంటే మరోవైపు అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. పూర్తిగా అదుపు చేయడానికి సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఒకవైపు ఫైరింజన్ రాకపోవడంతో ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని వైసిపి ఆరోపిస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.
* వైసిపి నిర్విర్యానికి కుట్ర
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీని ( YSR Congress )నిర్వీర్యం చేసే పనిలో కూటమి ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల జరిగిన మునిసిపల్ ఉప ఎన్నికల్లో సైతం కూటమి విధ్వంసం సృష్టించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద అగ్ని ప్రమాదం రూపంలో కలకలం చోటుచేసుకుంది. దీనిపై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. పక్కా ప్లాన్ తోనే ఈ ఘటన జరిగినట్లు వైసిపి అనుమానిస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Fire accident near ys jagan house
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com