
AP MLC Elections- YCP: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొంది. తొలుత ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 16 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. జూలై లో గవర్నర్ కోటా కింద మరో రెండు స్థానాలు భర్తీకానున్నాయి. మొత్తమ్మీద 18 ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త వారు కొలువుదీరనున్నారు. ఇందులో పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు తప్పించి.. మిగతావి వైసీపీకి దక్కే చాన్స్ ఉంది. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు అధికార వైసీపీ అభ్యర్థులను నిలబెట్టింది. స్థానిక సంస్థలకు సంబంధించి మొత్తం 9 స్థానాలు ఖాళీ అయ్యాయి. మార్చి 29న ఎమ్మెల్యేల కోట కింద ఎన్నికైన ఏడుగురు పదవీకాలం ముగియనుంది. అటు జూలైలో ఖాళీకానున్న రెండు స్థానాలతో కలిపి…అన్నింటికీ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. ఇందుకు సంబంధించి కీలక సమావేశం నేడు జరగనుంది.
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. అటు విపక్షాలు సైతం దూకుడు పెంచాయి. అదే సమయంలో అధికార పార్టీలో ధిక్కార స్వరాలు, అసంతృప్త రాగాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అక్కడ ఎలా ముందుకెళ్లాలో తెలియక హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో ఎమ్మెల్సీ స్థానాలు భారీగా ఖాళీకావడం అధికార పార్టీకి ఊరటనిచ్చే అంశం. వివాదాలు ఉన్న నియోజకవర్గాల్లో ఒకరికి ఎమ్మెల్సీ పదవితో సంతృప్తపరచనున్నారు. అదే సమయంలో గతంలో హామీ ఇచ్చిన వారికి పదవి కట్టబెట్టనున్నారు.
175 నియోజకవర్గాలకుగాను 175 గెలుపొందాలని జగన్ భావిస్తున్నారు. అయితే చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేకపోవడంతో మార్చుతారన్న టాక్ ఉంది. అయితే వారికి ఎప్పటికప్పుడు గడువు ఇస్తున్నారు. ఎంతమందిని మార్చుతారో ఇప్పటివరకూ స్పష్టత లేదు. నివేదకల ఆధారంగా ఎమ్మెల్యేలకు హెచ్చరిస్తున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు అభ్యర్థులను ప్రకటిస్తానని చెబుతున్న నేపథ్యంలో పక్కకు తప్పించే వారి జాబితాను ముందే వెల్లడించే అవకాశముంది. ఆ సమయంలో ఎదురయ్యే పరిణామాలకు రెడీ అయ్యే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికలు చాలా కీలకం. గతసారి కలిసొచ్చిన అంశాలేవీ ఈసారి వచ్చే చాన్స్ లేదు. అందుకే సీఎం జగన్ ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. సామాజిక సమీకరణలకు పెద్దపీట వేసి అభ్యర్థులను డిసైడ్ చేయనున్నారు. అటు గతంలో చాలామంది నాయకులకు హామీ ఇచ్చారు. అందులో కొందరికి చాన్స్ దక్కే అవకాశముంది. మిగతా వారికి పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా అవకాశమిస్తామని సర్దిచెప్పే చాన్స్ ఉంది. అయితే ఎమ్మెల్యేలతో టిక్కెట్ల కోసం పోటీపడే వారికి ఈసారి పరిగణలోకి తీసుకునే అవకాశముంది.
పార్టీ మారిన వెంటనే కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణను పశ్చిమగోదావరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. కడప నుంచి జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డికి ఖరారయ్యే చాన్స్ ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్య మీసాల నీలకంఠం నాయుడు లేదా నర్తు రామారావుల పేర్లు పరిగణలోకి తీసుకున్నారు. గుంటూరు నుంచి ఈ సారి మర్రి రాజశేఖర్ కు పక్కాగా పదవి దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. పశ్చిమ గోదావరిలో మరోస్థానానికి గుణ్ణం నాగబాబు, వంక రవీంద్ర పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. తూర్పు గోదావరి నుంచి కూడిపూడి సూర్యనారాయణ, గన్నవరంలో వంశీని వ్యతిరేకిస్తున్న దుడ్డు రామచంద్రరావు, వెంకటరావుల్లో ఒకరికి చాన్స్ దక్కే అవకాశముంది. సామాజిక సమీకరణలు, నియోజకవర్గంలో పరిస్థితులు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.