YCP: ఏపీలో రెండోసారి అధికారంలోకి రావాలని జగన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా రకాల ప్రయోగాలకు నాంది పలికారు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చారు. దీంతో చాలామంది నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు. గ్రౌండ్ లెవెల్ లో సైతం వైసీపీ శ్రేణులు పార్టీని వీడుతున్నాయి.తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనలో చేరుతున్నాయి. మరోవైపు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సైతం చాలా యాక్టివ్ అవుతోంది. వైసిపి ఓటు బ్యాంకు ను చీల్చి దెబ్బతీయాలని భావిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రశాంత్ కిషోర్ వైసీపీ కచ్చితంగా ఓడిపోబోతోందని తేల్చి చెప్పడం.. వైసీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఒకవైపు, విపక్షాలన్నీ కూటమి కట్టడం మరోవైపు, వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టుముట్టడం ఇంకోవైపు, అన్నింటికి మించి షర్మిల సవాల్ విసురుతుండడంతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
మొన్నటి వరకు వచ్చిన సర్వేలన్నీ వైసీపీ మరోసారి అద్భుత విజయం అందుకుంటుందని తేల్చి చెప్పాయి. కానీ విపక్షాలన్నీ కూటమి కట్టిన తర్వాత సీన్ మారుతోంది. కొన్ని సర్వేలు తక్కువ మెజారిటీతో వైసిపి గెలుపొందుతుందని చెప్పగా.. మరికొన్ని సర్వేలు మాత్రం వైసీపీకి ఓటమి ఖాయమని తేల్చి చెబుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రశాంత్ కిషోర్ లెక్క కట్టి మరి వైసీపీకి ఓటమి తప్పదు అని చెప్పడం పార్టీ శ్రేణుల్లో ఆందోళనకు దారితీస్తోంది. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పని చేశారు. బహిరంగ సభలోనే పార్టీ శ్రేణులకు పీకే ను జగన్ పరిచయం చేశారు. జగన్ తో సమానంగా ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ శ్రేణులు గౌరవించాయి. ఎంతగానో అభిమానించాయి. అటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైసీపీకి ఓటమి తప్పదని జోష్యం చెప్పడం విశేషం.
దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉచిత పథకాలు పనిచేయలేదని పీకే తేల్చి చెప్పారు. ఏపీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ మాటలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. ఏపీలో అభివృద్ధి లేదన్న అపవాదు బలంగా ఉంది. కానీ సంక్షేమ పథకాలు అమలు చేసిన నేపథ్యంలో సులువుగా విజయం సాధించవచ్చు అని వైసిపి అంచనా వేస్తోంది.అయితే అది అంత సులువు కాదని విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు. దీనిని బలపరుస్తూ ప్రశాంత్ కిషోర్ వైసిపి ఓడిపోనుందని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో.. ఆయన మాటలను మెజారిటీ వైసీపీ శ్రేణులు విశ్వసించడం లేదు. అయితే గ్రౌండ్ లెవెల్ లో ప్రభుత్వం పై వ్యతిరేకత, విపక్షాల ఐక్యత, వైఎస్ కుటుంబంలో చీలిక తదితర కారణాలతో.. ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లో వాస్తవం కూడా ఉంటుందని కొంతమంది వైసీపీ నేతలు విశ్వసిస్తున్నారు. అయితే గెలుపు పై అపార నమ్మకం పెట్టుకున్న వైసీపీ క్యాడర్ కు ప్రశాంత్ కిషోర్ మాటలు రుచించడం లేదు. కానీ వారిలో ఒక రకమైన భయం మాత్రం కనిపిస్తోంది.