Pushpa 2 New Look: మరికొద్ది గంటల్లో పుష్ప-2 సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కానుంది. సోమవారం అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకొని మైత్రి మూవీ మేకర్స్ పుష్ప-2 టీజర్ విడుదల చేయనుంది. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్స్ విడుదల చేస్తున్న చిత్ర యూనిట్.. ఆదివారం సాయంత్రం విడుదల చేసిన “పుష్పరాజ్ మాస్ అవతారం” సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్…ఇలా ఏ సోషల్ మీడియా తీసుకున్నా ట్రెండింగ్ లో ఉంది. సోమవారం విడుదలయ్యే టీజర్ కోసం యావత్ అల్లు అర్జున్ అభిమాన గణం ఎదురుచూస్తోంది. కానీ టీజర్ కంటే ముందే.. పుష్ప మాస్ అవతారంలో.. చిత్ర యూనిట్ కీలక విషయాలు వెల్లడించింది.. ఇంతకీ అవేంటంటే..
మాస్ అవతారంలో..
ముందుగానే చెప్పినట్టు అల్లు అర్జున్ ఈ ఫోటోలో మాస్ అవతారంలో కనిపించారు.. అందులో ఒక్కొక్క అంశాన్ని పరిశీలిస్తే..
గల్ల లుంగీ
పుష్ప మొదటి భాగం.. చిత్తూరు శేషాచలం పరిసర ప్రాంతాల్లో జరిగినట్టు దర్శకుడు చూపించాడు. ఆ ప్రాంతం తమిళనాడుకు సరిహద్దులో ఉంటుంది. తమిళనాడు సంస్కృతి శేషాచలం చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ప్రతిబింబిస్తుంది. అందుకే తమిళనాడు మాదిరే ఇక్కడి ప్రజలు కూడా గల్ల లుంగీ కట్టుకుంటారు..పుష్ప -2 లో కూడా అల్లు అర్జున్ గల్ల లుంగి కట్టుకొని కనిపించాడు.. తను ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉన్నాడని.. లుంగీ కట్టుకోవడం ద్వారా పుష్ప రాజ్ తన డౌన్ టు ఎర్త్ ను ప్రతిబింబించాడు.
బంగారు గొలుసులు
పుష్ప మొదటి భాగంలో ఎర్రచందనం నరికే కూలీగా అల్లు అర్జున్ కనిపించాడు. ఆ తర్వాత సిండికేట్ లో కీలక వ్యక్తిగా ఎదిగాడు. అలా అతడు ఎర్రచందనం మాఫియాను శాసించే వ్యక్తిగా ఎదిగాడని చెప్పడానికి అతడి ఒంటిపై బంగారు గొలుసులు.. ఎడమ చేయి చిటికెన వేలుకు గులాబీ రంగు (పాశ్చాత్య దేశాలలో శ్రీమంతులు ఇలాగే పెట్టుకుంటారు) ను ప్రధానంగా చూపించారు.. పుష్ప రాజ్ మాస్ అవతారంలో ఈ దృశ్యం అత్యంత కీలకంగా కనిపిస్తోంది.
గొడ్డలి
పుష్ప-2 మాస్ అవతారంలో అల్లు అర్జున్ ఒక చేత్తో గొడ్డలి పట్టుకున్నాడు. ఇదే గొడ్డలి “దాక్కో దాక్కో మేక” అనే పాటలో అల్లు అర్జున్ పట్టుకొని కనిపిస్తాడు. ఆ పాటలో అతడు ఎర్రచందనం వృక్షాలను నరుకుతూ కనిపిస్తాడు. సేమ్ అదే గొడ్డలి పుష్ప మాస్ అవతారంలో అల్లు అర్జున్ పట్టుకున్నాడు. దానికి రక్తం కూడా అంటుకుంది. అంటే తనకు అడ్డు వచ్చిన వారిని గొడ్డలితో నరికినట్టు.. ఇక పుష్పకు ఎదురు లేదన్నట్టు అవగతమవుతోంది.
సింహాసనం
అల్లు అర్జున్ కూర్చున్న సింహాసనంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. సింహాసనం పై భాగంలో జ్వలిస్తున్న సూర్యుడి చిహ్నం కనిపిస్తోంది. అదే చిహ్నం అల్లు అర్జున్ ఉన్న డెన్ గోడలపై కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇక సింహాసనానికి అటూ ఇటూ గాండ్రిస్తున్న సింహం బొమ్మలు ఉన్నాయి. సేమ్ సింహాసనంలో కూర్చున్న అల్లు అర్జున్ ముఖం కూడా గాండ్రిస్తున్న సింహంలాగే ఉంది.. ఇక సింహాసనం లో వాడిన ఆకృతులు..పుష్ప -“2” టైటిల్ లోగో లో ఉన్న ఆకృతులు ఒకేలాగా ఉన్నాయి. ఒకరకంగా అది పరమపద సోపానం లాగా కనిపిస్తోంది. అంటే ఎర్రచందనం అక్రమ వ్యాపారంలో పుష్ప రాత్రికి రాత్రే కింగ్ కాలేదని, ఎన్నో అవాంతరాలు దాటుకొని ఇక్కడి దాకా వచ్చాడని తెలుస్తోంది. ప్రజా సింహాసనం కింది భాగం ఎరుపులో కనిపిస్తోంది. అంటే ఎర్రచందనం వ్యాపారాన్ని మొత్తం తనకింద పెట్టుకున్నాడని ఈ దృశ్యం ద్వారా దర్శకుడు మనకు చెప్పకనే చెప్పాడు.
డెన్
అల్లు అర్జున్ కూర్చున్న చుట్టుపక్కల ప్రాంతం ఒక డెన్ లాగా కనిపిస్తోంది. అది అత్యంత దృఢంగా నిర్మించినట్టు అవగతం అవుతోంది. అంటే పుష్పరాజ్ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడని.. తన వ్యాపారం గురించి ఇతరులు పసిగట్టకుండా ఉండేందుకు ఒక కోటను నిర్మించుకున్నాడని స్పష్టమవుతోంది. ఇక చుట్టుపక్కల ఉన్న వారంతా అధునాతన ఆయుధాలను పట్టుకొని కనిపిస్తున్నారు. పుష్ప పక్కన ఉండే కేశవ చేతిలో ఒక సూట్ కేసు లో నిండుగా దుడ్డు( నగదు) పట్టుకొని కనిపిస్తున్నాడు. అంటే సిండికేట్ మొత్తాన్ని పుష్ప రాజ్ శాసిస్తున్నాడని దర్శకుడు హింట్ ఇచ్చాడు.
పుష్ప రాజ్ మాస్ అవతారంలోనే ఇన్ని విషయాలు ఉన్నాయంటే.. సోమవారం విడుదలయ్యే టీజర్ లో సినిమాకు సంబంధించి ఇంకా ఎన్ని విషయాలు చెబుతారో.. మొత్తానికి మాస్ అవతారంలో సుకుమార్ జీనియస్ మరోసారి కనిపించింది. మొదటి భాగమే వందల కోట్లు వసూలు చేస్తే.. మరి రెండో భాగం ఎంతటి బీభత్సాన్ని సృష్టిస్తుందో..