YCP: ఎన్నికల కోసం అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ తరుణంలో కొన్ని రకాల నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాయి. అయితే ఈ క్రమంలో నిర్ణయాలపై ఫేక్ ప్రచారాలు ఎక్కువయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 11మంది అభ్యర్థులను మార్చారు. ఈ తరుణంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 80 మంది అభ్యర్థులను మార్చుతారని టాక్ నడుస్తోంది. అయితే అధికార పార్టీ ఈ విషయాన్ని ఇంతవరకు ధృవీకరించలేదు. సీఎంవో కార్యాలయానికి ఏ పని మీద ఎమ్మెల్యేలు వెళుతున్నా.. అభ్యర్థుల మార్పుపై ఊహాగానాలు రేగుతున్నాయి. అంతకుమించి ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలు నియమించినట్లుగా ఓ ప్రకటన విడుదలైంది. అయితే అది ఫేక్ అని.. దానిని ఎవరూ నమ్మవద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది.
రెండో జాబితా పై ఇంకా కసరత్తు కొనసాగుతుందని వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులో సర్కులేట్ అవుతున్న ప్రెస్ నోట్లో పొందుపరిచిన పేర్లు నిజం కాదని స్పష్టం చేసింది. క్యాడర్లు అయోమయం సృష్టించడానికి రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారం అని తేల్చి చెప్పింది. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మార్చిన మాట వాస్తవమేనని.. దానిని ఆధారంగా చేసుకుని ప్రత్యర్ధులు తమ పార్టీ క్యాడర్లో గందరగోళం సృష్టించడానికి ఇష్టానుసారంగా పేర్లను మార్చి ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
అయితే ఈ తరహా ఫేక్ ప్రచారం ఇప్పుడు కొత్త కాదు. కొద్ది రోజుల కిందట టిడిపి విషయంలో కూడా ఇలాంటి ఫేక్ ప్రచారమే ఒకటి బయటకు వచ్చింది. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు పేరుతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. చివరకు అది ఫేక్ అని ప్రత్యేక ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది. అటు మీడియాలో కథనాలను సైతం ఫేక్ గా మార్చి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల సమీపించే కొలది ఈ తరహా ప్రచారాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో వైసిపి నాయకత్వం అలర్ట్ అయ్యింది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని.. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే తామే స్వయంగా ప్రకటిస్తామని చెప్పడం విశేషం.
అభ్యర్థుల మార్పు విషయంలో వైసీపీ హై కమాండ్ పై వస్తున్న విమర్శలు దృష్ట్యా కొద్దిరోజుల పార్టీ ప్రక్రియకు పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ మార్పు గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. దీనివల్ల లాభం కంటే నష్టం అధికమని హైకమాండ్ గుర్తించినట్లు సమాచారం. దాదాపు అన్ని జిల్లాల నుంచి ఎమ్మెల్యేలకు సీఎం ఓ పిలుపు కూడా ఓ రకమైన ఇబ్బందికర పరిస్థితిలోకి నెడుతోంది. ఇది అదునుగా మార్పు విషయంలో లేనిపోని ప్రచారానికి సోషల్ మీడియా తెరతీస్తోంది. ఈ క్రమంలోనే ఫేక్ ప్రచారాలు ఎక్కువవుతున్నాయి. అందుకే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని హై కమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.