AP Survey: ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అధికార వైసిపి పెద్దఎత్తున అభ్యర్థులను మార్చుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ సైతం దూకుడు పెంచింది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోనే జనసేనతో పొత్తు పెట్టుకుంది. బిజెపి డైలమాలో ఉంది. ఒంటరి పోరా? లేకుంటే టీడీపీ, జనసేన కూటమితో చేరడమా? అన్నది తేల్చుకోలేకపోతోంది. మరోవైపు సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. ప్రజాభిప్రాయం ఇది అంటూ ఫలితాలను వెల్లడిస్తున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో పొలిటికల్ క్రిటిక్ సంస్థ ఓ సర్వేను నిర్వహించింది. జిల్లాల వారీగా తన సర్వే ఫలితాలను విడుదల చేస్తోంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఫలితాలను విడుదల చేసింది. తాజాగా అనంతపురం జిల్లాకు సంబంధించిన ఫలితాలను వెల్లడించింది ఆ సంస్థ. కేవలం అనంతపురం లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంది. హిందూపురం లోక్సభ పరిధిలోకి వచ్చే సత్య సాయి పుట్టపర్తి జిల్లా పరిధిలోని స్థానాలను ఈ జాబితాలో చేర్చలేదు. అనంతపురం లోక్ సభ పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాల్లో అధికార వైసిపి, టిడిపిల మధ్య హోరాహోరీ ఫైట్ నెలకొంది. ఎనిమిది స్థానాల్లో చెరో నాలుగు స్థానాలు ఆ రెండు పార్టీలు గెలుచుకుంటాయని పొలిటికల్ క్రిటిక్ అభిప్రాయపడింది.
రాయదుర్గం, సింగనమల, కళ్యాణదుర్గం, రాప్తాడు నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరనుంది. ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం అర్బన్ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకోనుంది. గ్రామీణ ప్రాంతాల్లో వైసిపి, అర్బన్ ప్రాంతాల్లో టిడిపి బలంగా కనిపిస్తున్నట్లు పొలిటికల్ క్రిటిక్ అభిప్రాయపడింది. అయితే అనంతపురం జిల్లాలో వైసీపీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కవని తేలడం విశేషం. వైసిపి ఆవిర్భావం తర్వాత 2014లో ఇక్కడ ప్రతికూల ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ స్వీప్ చేసినంత పని చేసింది. ఎన్నికల్లో మాత్రం పట్టు సడిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.