Rajkumar Hirani Vs Prashanth Neel: ఇద్దరు బడా స్టార్స్ ప్రభాస్-షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద తలపడ్డారు. ఒక్కరోజు వ్యవధిలో డంకీ, సలార్ విడుదలయ్యాయి. ఇది కలెక్షన్స్ దెబ్బతీసే అంశం. ఎవరో ఒకరు తగ్గుతారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా డంకీ వాయిదా పడుతుందంటూ వార్తలు వచ్చాయి. అలా జరగలేదు. డిసెంబర్ 21న డంకీ, 22న సలార్ విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. కలెక్షన్స్ పరంగా డంకీ వెనకబడింది. సలార్ మాత్రం ఫస్ట్ డే ఓపెనింగ్స్ లో సత్తా చాటింది.
డంకీ-సలార్ బాక్సాఫీస్ బరిలో తలపడిన నేపథ్యంలో ఈ రెండు చిత్రాల దర్శకుల మధ్య పోలికలు మొదలయ్యాయి. ఎవరు గొప్ప అనే చర్చ నడుస్తోంది. ఇద్దరినీ కంపేర్ చేస్తూ ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. మరి ఈ లెక్కల ప్రకారం ఎవరు గొప్పో చూద్దాం… రాజ్ కుమార్ హిరానీ 2003లో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇక ప్రశాంత్ నీల్ మొదటి చిత్రం 2014లో విడుదలైంది.
20 ఏళ్ల కెరీర్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకుడిగా చేసింది కేవలం 6 చిత్రాలు మాత్రమే. పదేళ్లలో 4 సినిమాలు చేశారు. వీరి సినిమాల యావరేజ్ ఫూట్ ఫాల్స్ చూస్తే… రాజ్ కుమార్ హిరానీకి 2.4 కోట్లు ఉంది. ప్రశాంత్ నీల్ కి 2.2 కోట్లు ఉంది. వీరి చిత్రాల యావరేజ్ ఐఎండీబీ రేటింగ్… రాజ్ కుమార్ హిరానీకి 8.1 ఉంటే… ప్రశాంత్ నీల్ కి 8.2 ఉంది.
కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ గమనిస్తే… రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన పీకే అత్యధికంగా రూ. 770 కోట్లు సాధించింది. ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 2 రూ. 1215 కోట్లతో కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ గా ఉంది. రాజ్ కుమార్ హిరానీ తెరెకెక్కించిన చిత్రాల్లో అత్యధికంగా 3 ఇడియట్స్ 8.4 ఐఎండీబీ రేటింగ్ రాబట్టింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చాప్టర్ 2 ఆయన చిత్రాల్లో అత్యధికంగా 8.3 రేటింగ్ రాబట్టింది. ఎవరు గొప్ప అంటే చెప్పడం కష్టమే. రాజ్ కుమార్ క్లాస్ డైరెక్టర్, ప్రశాంత్ నీల్ మాస్ డైరెక్టర్. ఎవరి స్టైల్ వారిది.