Vasupalli Ganesh Kumar: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో కొత్త వాదన తెరపైకి వచ్చింది. విజయసాయిరెడ్డి మాదిరిగానే వివాదాస్పద నేతలంతా బయటకు వెళ్లిపోవాలన్నదే ఈ డిమాండ్. విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఈ డిమాండ్ చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. మరోవైపు మాజీ మంత్రి రోజా మాటలు తగ్గించుకుంటే మేలని కూడా చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లి పోవడానికి ఆహ్వానించారు. ఆయన తీరుతోనే ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించారని విజయసాయిరెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు. విజయసాయి రెడ్డి వల్లే రుషికొండ ప్యాలెస్ కట్టారని కూడా చెప్పుకొచ్చారు. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ పార్టీకి డేంజర్ గా మారారని.. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గ్రహించాలన్నారు.
* కూటమి ప్రభుత్వంపై పొగడ్తలు
మరోవైపు కూటమి ప్రభుత్వ ( allians government )గొప్పదనాన్ని కూడా పొగిడారు ఈ మాజీ ఎమ్మెల్యే. తొమ్మిది నెలలుగా కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నామని.. ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదన్నారు. ఎవరు ఎంత మందిని పెళ్లి చేసుకుంటే మనకెందుకు అని.. వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలోనే మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పారు. అయితే సరిగ్గా వల్లభనేని వంశీ అరెస్టు సమయంలోనే వాసుపల్లి గణేష్ కుమార్.. ఈ కామెంట్స్ చేయడం విశేషం.
* ఆ ఇద్దరి తీరుపై అభ్యంతరాలు
అయితే కొడాలి నానితో( Kodali Nani ) పాటు వల్లభనేని వంశీ విషయంలో వైసీపీలోనే అభ్యంతరాలు ఉన్నాయి. వారిద్దరూ దూకుడు వల్లే ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని ఎక్కువమంది వైసీపీ నేతలు అభిప్రాయపడుతుంటారు. ఇప్పుడు అదే అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు వాసుపల్లి గణేష్ కుమార్. అయితే సరిగ్గా వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు సమయంలోనే గణేష్ కుమార్ ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం వైరల్ అవుతోంది. అయితే దీనిపై ఎలా స్పందించాలో తెలియక వైసీపీ సతమతమవుతోంది. నిజంగా వాసుపల్లి గణేష్ కుమార్ ఆ కామెంట్స్ చేశారా? లేకుంటే ఉద్దేశపూర్వకంగా చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.
* పార్టీ మారేందుకు సిద్ధం
వాసుపల్లి గణేష్ కుమార్ ( vasupally Ganesh Kumar) తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు సిద్ధపడినట్లు ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి వాసుపల్లి గణేష్ కుమార్ టిడిపి నుంచే సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కీలక నేతలంతా వైసీపీకి గుడ్ బై చెబుతున్న తరుణంలో వాసుపల్లి గణేష్ కుమార్ సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.