Vijayawada  Flood victims : వరద వచ్చి ఇన్ని రోజులు అయినా పట్టించుకోరా.. ఇదీ వరద బాధితుల వ్యథ

తెలుగు రాష్ట్రాలకు వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో వర్షం విలయతాండవం సృష్టించింది. ఒకవైపు వర్షం, మరోవైపు బుడమేరు వాగు బీభత్సం విజయవాడకు షాక్ కు గురిచేశాయి. ఇప్పుడిప్పుడే నగరవాసులు తేరుకుంటున్నారు.

Written By: Dharma, Updated On : September 24, 2024 10:48 am

Vijayawada  Flood victims

Follow us on

Vijayawada  Flood victims : విజయవాడకు భారీ వరదలు తీవ్ర నష్టానికి గురిచేశాయి. గతంలో కానీ విని ఎరుగని రీతిలో విజయవాడ నగరానికి వరద ముంచెత్తింది.దాదాపు సగానికి పైగా నగరం నీటిముంపు బారిన పడింది. లక్షలాదిమంది నిరాశ్రయులు అయ్యారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టింది.సీఎం చంద్రబాబు స్వయంగా విజయవాడ కలెక్టరేట్లో ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.బాధిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సందర్శించారు.బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కేంద్రం నుంచి తగినంత సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అయితే రోజులు గడుస్తున్నా ఇంతవరకు వరద బాధితులకు సహాయం అందలేదు. దీంతో వారంతా ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా వరద బాధితుల సోమవారం రాత్రి రహదారిపై ధర్నా చేశారు. దీంతో నగరంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరకు పోలీసులు అతి కష్టం మీద వారితో ఆందోళన విరమింపజేయాల్సి వచ్చింది.

* సాయం పై స్పష్టమైన ప్రకటన
నష్టపోయిన ప్రతి కుటుంబానికి సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటన చేశారు. సాయంపై నిర్దిష్ట మార్గదర్శకాలు కూడా రూపొందించారు. చివరకు వరదల్లో నష్టం జరిగిన వాహనాలకు సైతం పరిహారం అందిస్తామని చెప్పుకొచ్చారు. అయితే సహాయ చర్యలు మాదిరిగానే.. పరిహార కూడా ప్రధాన ప్రాంతాలకే పరిమితం అవుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే బాధితులు ఎక్కడికక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఆందోళనకు దిగుతున్నారు. సహాయ చర్యల్లో ప్రభుత్వం బాగానే పని చేసినా.. ఇప్పుడు పరిహారం విషయంలో మాత్రం జాప్యం జరుగుతుండడం విమర్శలకు తావిస్తోంది.

* నెల సమీపిస్తున్న అందని సాయం
విజయవాడ నగరానికి వరదలు వచ్చి దాదాపు నెల సమీపిస్తోంది. కానీ ఇంతవరకు బాధితులకు మాత్రం పరిహారం దక్కలేదు. ముఖ్యంగా నగరంలోని శివారు ప్రాంత ప్రజలకు ఎటువంటి సాయం అందకపోవడంతో.. వారిలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. చాలాచోట్ల అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిన్న జరిగిన ఆందోళనలో కలెక్టర్ కు వ్యతిరేకంగా బాధితులు నినాదాలు చేశారు. తమకు తక్షణం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పోలీసులు సముదాయించడంతో ఈ వివాదం సద్దుమణిగింది.

* ఆ సంతృప్తి లేదు
విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం కొంతమేరకు విజయవంతం అయ్యింది. ప్రధాన విపక్షం నుంచి ఆరోపణలు వచ్చినా.. ప్రభుత్వం మాత్రం బాగానే పనిచేస్తుందని బాధిత వర్గాల నుంచి వినిపించింది. అయితే ఇప్పుడు పరిహారం విషయంలో ప్రకటనలకే ప్రభుత్వం పరిమితం అవుతుండడం.. ఒక రకమైన విమర్శలకు కారణమవుతోంది. బాధితులలో సైతం ఒక రకమైన అసంతృప్తి ప్రారంభమైంది. నెల రోజులు సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం స్పందించకపోతే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.