AP Elections 2024: వైసీపీకి షాక్ ఇచ్చిన ఈసీ

తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో సీఐ జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైసిపికి ఫేవర్ చేశారన్నది ఈయనపై ఉన్న ఆరోపణ.

Written By: Dharma, Updated On : May 13, 2024 9:20 am

AP Elections 2024

Follow us on

AP Elections 2024: పోలింగ్ కు ముంగిట వైసీపీకి గట్టి షాక్ తగిలింది. అధికార పార్టీ పై వీర విధేయత ప్రదర్శించిన పోలీస్ అధికారులపై వేటు పడింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు చెందిన సీఐలను ఎన్నికల కమిషన్ వేరే జిల్లాలకు బదిలీ చేసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకుంటూ.. ఎన్నికల కమిషన్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లడంతో.. ఈసీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరొందిన తిరుపతి డిటిసి ఇన్స్పెక్టర్ జగన్మోహన్ రెడ్డి, డిటిఆర్బీ ఇన్స్పెక్టర్ అంజూ యాదవ్, సోషల్ మీడియా పర్యవేక్షణ విభాగం సిఐ అమర్నాథ్ రెడ్డి, కమాండో కంట్రోల్ విభాగం సిఐ శ్రీనివాసులు, సైబర్ క్రైమ్ సీఐ వినోద్ కుమార్ లను చిత్తూరు జిల్లా నుంచి అనంతపురానికి బదిలీ చేశారు. ఎన్నికల్లో వైసీపీకి ఏకపక్షంగా సాయం చేస్తున్నారని ఫిర్యాదులు మేరకు ఈసీ వీరిపై చర్యలకు దిగింది. ఇది ఒక విధంగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి కి గట్టి షాకే.

తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో సీఐ జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైసిపికి ఫేవర్ చేశారన్నది ఈయనపై ఉన్న ఆరోపణ. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను బెదిరించారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. తిరుపతి సహకార బ్యాంకు ఎన్నికల్లో వైసిపి రిగ్గింగ్ కు పాల్పడితే సహకరించారన్నది కూడా ఈయనపై ఉన్న ఆరోపణ.

రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద మహిళా పోలీస్ అధికారి అంజూ యాదవ్. శ్రీకాళహస్తి సిఐగా సుదీర్ఘకాలం పనిచేశారు ఈమె. అధికార వైసిపి అరాచకాలకు దన్నుగా నిలిచారన్న ఆరోపణ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రేణిగుంట సిఐ గా ఉండేవారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలా పని చేశారన్నది ఈమెపై ఉన్న ప్రధాన ఆరోపణ.

చంద్రగిరి సీఐగా శ్రీనివాసులు సుదీర్ఘకాలం పని చేశారు. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు పని చేశారన్నది ఈయనపై ఉన్న ఆరోపణ. అధికార పక్షం అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచి.. బాధితులపైనే కేసులు మోపారన్నది విపక్షం చేసిన ఫిర్యాదు.

గాజుల మండ్యం పోలీస్ స్టేషన్లో సిఐగా పనిచేసిన సమయంలో అమర్నాథ్ రెడ్డి అరాచకాలకు పాల్పడ్డారు అన్నది ఒక ప్రధాన ఆరోపణ. అధికార పార్టీ ఇసుక మాఫియా ఆగడాలకు వెన్నుదన్నుగా నిలిచారని.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు వెళ్లాయి.

ఏడాది కిందట పదోన్నతి పొందారు సిఐ వినోద్. అలిపిరి, ఎం ఆర్ పల్లెలో ఎస్సైగా విధులు నిర్వహించేవారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైసీపీ పెద్ద ఎత్తున అక్రమాలకు తెగబడినా.. వారికి వత్తాసు పలికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో సైతం వైసీపీకి ఫేవర్ చేస్తున్నారన్న విపక్షం ఫిర్యాదులకు ఈసీ స్పందించింది. వీరందరిపై బదిలీ వేటు వేసింది. అయితే ఎన్నికల ముంగిట, పోలింగ్కు గంటల వ్యవధి ముందు సీఐలపై బదిలీ వేటు వేయడం విశేషం.

Tags