Pithapuram Varma: పిఠాపురం( Pithapuram ) వర్మకు త్వరలో పదవి ఇవ్వబోతున్నారా? ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కనుందా? ఆ పరిస్థితి కనిపిస్తోందా? ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ఇదే హాట్ టాపిక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు వర్మ. 2024 ఎన్నికల్లో టిడిపి గెలిచే కీలక నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. అంతలా గత ఐదేళ్లపాటు పార్టీ అభివృద్ధికి కృషి చేశారు వర్మ. కానీ చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ రావడంతో వర్మ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన అనుచరులు ఊరుకోలేదు. అభిమానులు సైతం ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయాల్సిందేనని వర్మపై ఒత్తిడి చేశారు. ఆ సమయంలోనే చంద్రబాబు పిలిచి బుజ్జగించారు. రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేసే పదవి వర్మదేనంటూ అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. కానీ కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. ఎన్నెన్నో పదవులు భర్తీ అయ్యాయి. ఎంతోమంది ఎమ్మెల్సీలు అయ్యారు. రాజ్యసభ సభ్యులుగా మారారు. కానీ ఇంతవరకు వర్మ కు ఎటువంటి పదవి దక్కలేదు.
* ఇండిపెండెంట్ గా గెలిచి రికార్డ్
వర్మ ( Verma )గతంలో పిఠాపురం నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన సందర్భం కూడా ఉంది. అంతలా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పట్టు పెంచుకున్నారు. 2009 నుంచి పిఠాపురంలో పోటీ చేస్తున్నారు వర్మ. 2014లో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కక పోయేసరికి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. భారీ మెజారిటీతో నెగ్గారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో ఓడిపోయారు. కానీ నియోజకవర్గంలో పట్టు కోల్పోలేదు. రెట్టింపు ఉత్సాహంతో గత ఐదేళ్లపాటు పనిచేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చేసరికి షాక్ అయ్యారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పనిచేశారు. అదే వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఆ పని చేయలేదు వర్మ.
* పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా..
ప్రస్తుతం గోదావరి( Godavari district) జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఇది తప్పకుండా కూటమి ఖాతాలో పడుతుంది. పైగా ఆరేళ్ల పదవి. వర్మను ఎంపిక చేస్తారని ప్రచారం నడుస్తోంది. కానీ హై కమాండ్ నుంచి సమాచారం లేదు. దీంతో ఆయన అనుచరుల్లో ఒక రకమైన ఆందోళన కొనసాగుతోంది. తప్పకుండా తమ నేతను అభ్యర్థిగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థి ఎంపిక పూర్తయిందని.. వర్మ కు అవకాశం లేదని మరో టాక్ నడుస్తోంది.
* మార్చిలో ఖాయమా
అయితే మార్చిలో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీల భర్తీ జరగనుంది. చాలామంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మరోవైపు వైసిపి తో పాటు ఎమ్మెల్సీ పదవులకు ఓ నలుగురు రాజీనామా చేశారు. కానీ మండలి చైర్మన్ వద్ద ఆ రాజీనామాలు పెండింగ్ లో ఉన్నాయి. అవసరం అయితే దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సదరు ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు రాజీనామాలు, ఇంకోవైపు పదవీ విరమణలతో భారీగా ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. అదేగాని జరిగితే వర్మకు తప్పకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై వర్మకు స్పష్టత ఉందని సమాచారం. త్వరలో వర్మ చట్టసభల్లోకి అడుగుపెట్టడం ఖాయమని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.