AP Elections 2024: ఏపీ విషయంలో ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఉంది. పోలింగ్ సందర్భంగా హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి, డిజిపి హరీష్ కుమార్ గుప్తాలను ఢిల్లీకి పిలిపించిన ఈసీ సంజాయిషీ కోరినట్లు సమాచారం. ఒకానొక దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అల్లర్లను నియంత్రించేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు నిఘా వర్గాల హెచ్చరికల మేరకు ఎన్నికల ఫలితాల అనంతరం.. హింస చెలరేగే అవకాశం ఉందని.. రాజకీయ దాడులకు ప్రయత్నించే ఛాన్స్ ఉందని తెలియడంతో ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. జూన్ 19 వరకు కేంద్ర పోలీస్ బలగాలను ఏపీలో కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అవసరమైతే అదనపు బలగాలను పంపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. తమకు ఓటు వేయలేదన్న నెపంతో ఈ దాడులు కొనసాగుతున్నాయి.
గత ఐదు సంవత్సరాలుగా ఏపీలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉండేది. అధికార పార్టీ దూకుడు మీద వ్యవహరించేది. అయితే ఇప్పుడు టిడిపి కూటమి సైతం సమ ఉజ్జిగా నిలవడం, అనుకూల ఫలితాలు వస్తాయని విశ్లేషణలు ప్రారంభం కావడం.. తదితర కారణాలతో అధికార, విపక్షం మధ్య హోరాహోరీ పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలోనే దాడులు జరుగుతున్నాయి. అయితే ముందుగా అంచనా వేయడంలో యంత్రాంగం విఫలమైంది. దీంతో పోలింగ్ రోజే కాకుండా.. ఆ తరువాత కూడా హింస చెలరేగింది. ఈసారి పల్నాడు, మాచర్లలో తారాస్థాయికి చేరుకుంది. అనంతపురం, తిరుపతిలో కూడా రాజకీయ దాడులు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను గృహనిర్బంధం చేశారు. అటు కేంద్ర బలగాలు వచ్చినాహింస ఆగడం లేదు. దీంతో ఈసీ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి తో పాటు డీజీపీలను ఢిల్లీ రప్పించింది. స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం.. రెండు వారాలపాటు కేంద్ర బలగాలు ఏపీలో ఉండేలా ఆదేశాలు ఇచ్చింది.