East Godavari Politics: టిడిపి అధిష్టానం పై( TDP high command ) కాపు నేతలు ఆగ్రహంగా ఉన్నారా? తమకు కనీస ప్రాధాన్యం లేదని బాధతో ఉన్నారా? జనసేనకు మాత్రమే ‘కాపు’ ప్రయోజనాలు దక్కుతున్నాయని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపు నేతలు పూర్తి అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం అసంతృప్తి పెరుగుతోందన్న టాక్ అయితే మాత్రం వినిపిస్తోంది. కనీసం జనసేన లో ఉన్న కాపు నేతలకు దక్కుతున్న ప్రాధాన్యంలో సగం కూడా తమకు లేదని ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది.
టిడిపికి బలమైన క్యాడర్..
ఉమ్మడి తూర్పుగోదావరి( East Godavari) జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో తప్పించి తూర్పులో మెజారిటీ సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేది. అయితే ఈసారి జనసేనతో పొత్తులో భాగంగా నాలుగు సీట్లు వదులుకుంది తెలుగుదేశం. ఉమ్మడి జిల్లాలో 19 సీట్లకు గాను.. 14 చోట్ల టిడిపి విజయం సాధించింది. నాలుగు చోట్ల జనసేన గెలుపొందింది. టిడిపి నుంచి గెలిచిన వారిలో నలుగురు కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరొకరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇంకొకరు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ కాపు నేతలకు కనీస గౌరవం లేకుండా పోతోంది. సింహభాగం రాజకీయ ప్రయోజనాలను జనసేన లో ఉన్న కాపు నేతలు దక్కించుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం టిడిపిలో ఉన్న కాపు నేతలకు రుచించడం లేదు. ఇలానే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా కనిపించడం లేదు.
Also Read: వైసిపి పరిస్థితే కూటమికి ఎదురవుతోందా?
కాకినాడలో సమావేశం..
ఇటీవల కాకినాడలోని( Kakinada) టిడిపి నేత ఇంట్లో సమావేశం అయ్యారు తూర్పుగోదావరి జిల్లా కాపు నేతలు. మండల స్థాయి నాయకులు సైతం హాజరయ్యారు. తమకు జిల్లాతో పాటు మండలాల్లో కూడా గౌరవం దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి చూడలేదని.. ఇప్పుడు మాత్రమే ఇలానే జరుగుతుందన్న అనుమానాలతో వారు ఉన్నారు. ఎన్నికల్లో తమను వాడుకొని విడిచి పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ హైకమాండ్ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలని భావిస్తున్నారు. హై కమాండ్ తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నారు.
ఆ సీనియర్ తీవ్ర అసంతృప్తి..
జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న జ్యోతుల నెహ్రూ( jyotula Nehru) ఉన్నారు. ఆయన చాలా ఆవేదనతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న జ్యోతుల నెహ్రూ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతూ వచ్చారు. అయితే మధ్యలో ప్రజారాజ్యం పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొద్దిరోజులపాటు ఉన్నారు. చివరకు తెలుగుదేశం పార్టీ గూటికి చేరుకున్నారు. అయితే సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్న తనకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం పై ఆవేదనతో ఉన్నారు. ఆపై తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నేతృత్వంలోనే కాపు నేతలు సమావేశమైనట్లు తెలుస్తోంది. మరి ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో చూడాలి.