MLC Duvvada : మాజీ సీఎం జగన్ కు ప్రశాంతత లభించడం లేదు. ఘోర పరాజయం తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కానీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక భారంగా మారుతోంది. ఇంకో వైపు పాత కేసులు తెరపైకి వస్తున్నాయి. దీంతో జగన్ ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఇటువంటి తరుణంలో అండగా నిలవాల్సిన నేతలు కొత్త చిక్కులు తెస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం తలనొప్పిగా మారుతోంది. ఆయన ఫ్యామిలీ విషయంలో తలెత్తిన వివాదం అటు తిరిగి ఇటు తిరిగి పార్టీకి నష్టం చేకూరుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబానికి చెక్ చెప్పాలని దువ్వాడ శ్రీనివాస్ కు అన్ని విధాల ప్రోత్సాహం అందించారు జగన్. అధికారంలో ఉన్న సమయంలో అదే దూకుడు కనబరిచారు దువ్వాడ. కానీ ఇప్పుడు అధికారానికి దూరమయ్యేసరికి అదే దువ్వాడ నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఫ్యామిలీ వ్యవహారంలో రోడ్డుపైకి ఆయన కుటుంబం వచ్చింది. మరోవైపు తన వద్ద ఉన్న గన్ విషయంలో మరో వివాదం కొని తెచ్చుకున్నారు దువ్వాడ. తన తండ్రిని కలిసేందుకు ఇద్దరు కుమార్తెలు ఇంటి వద్దకు వెళ్లారు. కానీ ఇంటి లోపల తాళం వేసి ఉంచారు. దీంతో ఆ ఇద్దరు కుమార్తెలు బయట వేచి ఉండక తప్పని పరిస్థితి. మరో మహిళతో దువ్వాడ సన్నిహితంగా ఉండడం వల్లే తమను దూరం పెట్టారని కుమార్తెలు ఆరోపిస్తున్నారు. ఇది మరువకముందే ఈరోజు మరో వివాదంలో చిక్కుకున్నారు దువ్వాడ శ్రీనివాస్.
* భార్యతో విభేదాలు
ఎన్నికలకు ముందు నుంచే భార్య దువ్వాడ వాణితో శ్రీనివాస్ కు విభేదాలు ఉన్నాయి. గత కొంతకాలంగా వారు వేరువేరుగా ఉంటున్నారు. ఓ మహిళతో దువ్వాడ శ్రీనివాస్ కు సంబంధం ఉందన్నది భార్య చేస్తున్న ఆరోపణ. అందుకే ఎన్నికలకు ముందు ఆమె రచ్చ చేశారు. కానీ జగన్ తో పాటు వైసిపి కీలక నేతలు సముదాయించారు. అప్పట్లో అది సద్దుమణిగింది. అయితే ఇప్పుడు ఏకంగా ఆ మహిళతో దువ్వాడ శ్రీనివాస్ సహజీవనం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ తల్లికి విడాకులు ఇవ్వకుండా తండ్రి శ్రీనివాస్ వేరే మహిళతో ఉండడాన్ని కుమార్తెలు ఇద్దరు తప్పు పడుతున్నారు. తండ్రి తీరును ఖండిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఇదే దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బహు భార్యత్వం నేరమని చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు జనసేన శ్రేణులు ట్రోల్ చేయడం ప్రారంభించాయి.
* లైసెన్స్ కోసం దరఖాస్తు
మరోవైపు పోలీస్ కార్యాలయానికి వెళ్లిన దువ్వాడ శ్రీనివాస్ గన్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్నారు. తన దగ్గర గన్ ఉందని.. దానికి లైసెన్స్ ఇవ్వాలని ఈనెల 7న జిల్లా పోలీసులను కలిసి దరఖాస్తు ఇచ్చారు. కొంతకాలంగా తనకు కొంతమంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. కొందరు తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఎవరైనా గన్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. కానీ తన వద్ద గన్ ఉందని.. దానికి మాత్రమే లైసెన్స్ ఇవ్వాలని దువ్వాడ కోరడం విశేషం. అయితే దువ్వాడ వద్ద ఉన్న గన్ కు అనుమతి ఉందా? అసలు ఎవరు ఇచ్చారు? అన్నది పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
* అధినేత మౌనం
అయితే దూకుడే ప్రామాణికంగా దువ్వాడ శ్రీనివాస్ కు ప్రమోట్ చేశారు జగన్. అప్పట్లో కింజరాపు కుటుంబం పై విరుచుకుపడేవారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గ్రామం పైనే దండెత్తారు. అప్పట్లో వైసీపీ ఇన్చార్జిగా ఉన్న దువ్వాడకు ఎమ్మెల్సీ గా ప్రమోట్ చేశారు జగన్. అటు ఎన్నికలకు ముందు జగన్ పై ఈగ వాలిన దువ్వాడ రెచ్చిపోయేవారు. ఇప్పుడు అదే దువ్వాడ వివాదం లో ఉన్నా జగన్ స్పందించకపోవడం విశేషం.