Rain Warning : మండుతున్న ఏపీ.. భారీ హెచ్చరికలు పంపుతున్న బంగాళాఖాతం

గత నెలలో వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. ప్రస్తుతం మాత్రం ఎండలు మండిపోతున్నాయి. వేసవిని తలపిస్తోంది వాతావరణం. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బంగాళాఖాతం నుంచి హెచ్చరికలు వచ్చాయి. భారీ తుఫాన్లు సంభవించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Written By: Dharma, Updated On : October 5, 2024 4:36 pm

Rain Warning

Follow us on

Rain Warning : ఏపీలో ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. వేసవిని తలపిస్తోంది వాతావరణం. ఉదయం 7 గంటల నుంచి భానుడు ప్రతాపం చూపుతున్నాడు. 10 గంటలకు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కానీ సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత మంచు విపరీతంగా కురుస్తోంది. ఈ విభిన్న వాతావరణంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు వర్షాలు లేక వరి పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది.ఈ తరుణంలో గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఒకటి కాదు రెండు కాదు రెండు అల్పపీడన ద్రోణులు ఏర్పడతాయని ప్రకటించింది. దీనివల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతోంది.ఏపీ, తమిళనాడుకు సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో ఈనెల 7, 8 తేదీల్లో తుఫానుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ ప్రభావంతో రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది.ఇంకొన్ని ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురవనున్నాయి.

* ఈ జిల్లాలకు వర్ష సూచన
రానున్న రెండు రోజుల్లో ఏపీలో చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శనివారం తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీ సత్య సాయి, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, అల్లూరి, మన్యం జిల్లాల్లో వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు. గుంటూరు, బాపట్ల, నెల్లూరు,పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఉభయగోదావరి, కోనసీమ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

* రెండు అల్పపీడనాలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను ప్రభావం ఏపీతోపాటు తెలంగాణపై కూడా ఉండనుంది. కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా, మహారాష్ట్రపై ప్రభావం చూపుతోందని కూడా తెలుస్తోంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం విస్తరిస్తోందని.. ఝార్ఖండ్,బీహార్, పశ్చిమ బెంగాల్ వైపు ఇది కదులుతోందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ఏపీలో మాత్రం ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.