Janasena: వచ్చే ఎన్నికల్లో జగన్ ను గద్దె దించాలని టిడిపి, జనసేన జతకట్టాయి. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జగన్ ను మట్టి కరిపించాలని నిర్ణయించాయి. వైసీపీ విముక్త ఏపీయే తన లక్ష్యమని పవన్ ప్రకటించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచేందుకు నిర్ణయించినట్లు చెప్పుకొస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. ఉమ్మడి కార్యాచరణ విషయంలో మాత్రం జనసేన కంటే తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉండడం విశేషం. ఈ విషయంలో జనసేన వెనుకబడడం ఆ పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది.
తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను రూపొందించిన సంగతి తెలిసిందే. మేనిఫెస్టోలో భాగంగా చంద్రబాబు ఈ పథకాలను ప్రకటించారు. బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ అన్న నినాదంతో టీడీపీ శ్రేణులు బలంగా ప్రచారం చేస్తున్నాయి. అదే స్పీడులో ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. కానీ జనసేన ప్రకటించిన షణ్ముఖ వ్యూహం అంటూ ఏదీ కనిపించడం లేదు. బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ పథకాల ప్రచార బోర్డులో మాత్రం పవన్ కళ్యాణ్ ఫొటో కనిపిస్తుండడం విశేషం. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రమే తాను అనుకున్నది ప్రచారం చేస్తోంది. ఆ స్థాయిలో పవన్ ప్రకటించిన షణ్ముఖ వ్యూహం కార్యక్రమాలు మాత్రం ఎక్కడా కానరాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కుదిరిన తర్వాత ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని పవన్ ప్రకటించారు. అటు టిడిపి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు తమ షణ్ముఖ వ్యూహంలో రూపొందించిన పథకాలను సైతం ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు కు మాత్రమే పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు. కానీ జనసేన పథకాలేవీ ప్రజల్లోకి వెళ్లకపోవడం ఆ పార్టీ శ్రేణులను విస్మయ పరుస్తోంది. చంద్రబాబు ఉమ్మడి కార్యాచరణ అంటూ చెప్పుకొచ్చారని.. కానీ ప్రజల్లోకి మాత్రం తెలుగుదేశం పార్టీ పథకాలను మాత్రమే పంపిస్తున్నారని.. చంద్రబాబు అసలు నైజం బయటపడిందని వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబుతో పొత్తు అంటే ఇలానే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొత్తులో సింహభాగ ప్రయోజనం ఆశించడం చంద్రబాబుకు కొత్త కాదు. గతంలో బిజెపి, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న సమయంలో సైతం ఉమ్మడి కార్యాచరణ విషయంలో చంద్రబాబు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేవారు. పొత్తులో మెజారిటీ ప్రయోజనాన్ని దక్కించుకునేవారు. ఇప్పుడు పవన్ విషయంలో సైతం అదే ఫార్ములాను చంద్రబాబు అనుసరిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం టిడిపి సూపర్ సిక్స్ పథకాలు వెళుతున్నట్టు.. తమ షణ్ముఖ వ్యూహం పథకాలు వెళ్లడం లేదన్న విషయం పవన్ కు అర్థం అవుతుందో? లేదో? ఇటువంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం పవన్ కు రాజకీయంగా నష్టం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు రాజకీయ అంశాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అయితే పవన్ గమనిస్తారో? గమనిస్తే జాగ్రత్త పడతారో? లేదో? చూడాలి.