CM Jagan: తాము అనుకున్నది సవ్యంగా జరగనప్పుడు.. అనుకున్న ఫలితం దక్కే పరిస్థితులు కనిపించనప్పుడు మనిషి వైరాగ్యపు మాటలను ఆశ్రయిస్తాడు. దేవుడు పై నెపం పెడతాడు. ఇప్పుడు ఏపీ సీఎం కూడా అటువంటి వైరాగ్యపు మాటలే చెబుతుండడం విశేషం. తన పాలన ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. ఇప్పుడు దిగిపోమన్నా దిగిపోతానని జగన్ చెబుతుండడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 30 సంవత్సరాల పాటు ఏకధాటిగా పాలిస్తానని చెప్పుకొచ్చిన ఆయనే.. ఇప్పుడు ఓటమి అనే మాట చెబుతుండడం విడ్డూరంగా ఉంది.
రాజ్ దీప్ సర్దేశాయ్ తెలుసు కదా? దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయల వరకు స్పాన్సర్ షిప్ ఇప్పించి ఏపీలో పెట్టించుకున్న కాంక్లేవ్ లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు జగన్. ఎన్నికల ముంగిట తన రాజకీయ వ్యూహాలను వెల్లడించడానికి ప్రాధాన్యమిచ్చారు. ఐదేళ్ల పాలనలో ఏం చేశాననే దానికంటే.. తాను గొప్పగా చేసినట్లు మాత్రమే చెప్పుకొచ్చారు. తాను బట్టన్ నొక్కితే ప్రజల జీవన పరిస్థితులే మారిపోయాయి అన్నట్టు ప్రకటించారు. నా జన్మ ధన్యమైందని.. ఇక అధికారం నుంచి దిగిపోయినా తనకు సంతోషమేనని తేల్చేశారు. తనకు తానుగా భుజం తట్టుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక అధికారం చాలు.. ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేశాను అని ధీమా కూడా వ్యక్తపరిచారు. అయితే ఆయనకు తెలియకుండానే ఓటమిని ఒప్పుకున్నారు. ఓటమి అనే సంకేతాన్ని పార్టీ శ్రేణులకు పంపించగలిగారని రాజకీయ విమర్శకులు అంచనా వేస్తున్నారు. తొలుత తనను చూసి ఓటేస్తారని జగన్ చెప్పుకొచ్చారు. కుక్కను సైతం అభ్యర్థిగా పెట్టినా గెలిచేస్తారని భ్రమలు కల్పించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకం ఉందని.. అభ్యర్థులపై మాత్రమే వ్యతిరేకత ఉందని.. సామాజిక సమీకరణల దృష్ట్యా అభ్యర్థులను మార్చుతున్నానని… అంతే తప్ప ఓడిపోతానని కాదని.. ఇలా ఏదేదో మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన చెప్పేది ఒకటే.. నేను మంచివాడిని.. దైవాన్ని నమ్ముతాను.. దైవ ఫలితం తప్పకుండా ఉంటుంది.. ఆ ఫలితం తనకు అనుకూలంగా వస్తుంది.. ఇలా దైవ వచనాలను సైతం తనకు అనుకూలంగా మాట్లాడి ఇంటర్వ్యూ ఇచ్చారు.
నేను ఒక అద్భుతం. మరోసారి అధికారంలోకి రాకుంటే ఏపీకి కష్టమేనని ఈ ఇంటర్వ్యూ ద్వారా జగన్ సంకేతాలు ఇచ్చారు. అయితే తెలంగాణలో కెసిఆర్, కేటీఆర్ ఇదే మాదిరిగా చెప్పుకొచ్చారు. తమ పార్టీ అధికారంలోకి రాకపోతే ఏదో జరిగిపోతుందని ప్రజలకు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. కానీ ప్రజలు నమ్మలేదు. మీరు లేకపోయినా పర్వాలేదు అని పక్కన పడేశారు. గతంలో కేటీఆర్ కంటే రేవంత్ దావోస్ సదస్సుకు వెళ్లి అంతకుమించి పెట్టుబడులు తీసుకొచ్చారు. కేటీఆర్ ను మైమరిపించారు. ఇప్పుడు జగన్ కూడా అదే తెలుసుకోవాలి. ఆయన కంటే ముందు చంద్రబాబు ప్రభుత్వం ఉందన్న విషయం గమనించాలి. చంద్రబాబు కంటే యువకుడు కావడం, మెరుగైన పాలన సాగిస్తారని నమ్మకంతోనే జగన్ ను ప్రజలు ఎన్నుకున్నారు. చంద్రబాబు కంటే జగన్ మంచి పాలన అందించారు అనుకుంటేనే ప్రజలు కొనసాగిస్తారు. లేకుంటే తెలంగాణ మాదిరిగా పక్కన పడేస్తారు. అంతమాత్రానికి తాను ఉంటేనే పాలన బాగుంటుందని తనకు తాను చెప్పుకోవడం మాత్రం అతి అవుతుంది. అయితే అన్నీ చేశానని సంతోషం వ్యక్తం చేసే క్రమంలో.. జగన్ నోట దిగిపోతానన్న మాట మాత్రం విస్మయపరుస్తోంది.