10th Class: పదో తరగతి విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నూతన విద్యావిధానంలో భాగంగా 2024–25 విద్యా సంవత్సరం నుంచి పరీక్ష విధానంలో మార్పు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. టెన్త్, ఇంటర్ విద్యార్థులు ఇక ఏడాదికి రెండుసార్లు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి టెన్త్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేవారు సెమిస్టర్ వారీగా ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు మొత్తం సిలబస్ ఒకేసారి చదవాల్సిన అవసరం ఉండదు.
రెండు భాగాలుగా సిలబస్..
నూతన విద్యాచట్టం 2020–21 నుంచి అమలు చేయాలని కేంద్రం భావించింది. అయితే కరోనా రావడంతో అమలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో క్రమంగా కొన్ని కొన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే టెన్త్, ఇంటర్ విద్యార్థులపై సిలబస్ ఒత్తిడి తగ్గించేందుకు రెండుసార్లు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయిచింది. దీంతో మొత్తం సిలబస్‌ను రెండు భాగాలుగా విభజించి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తారు. దీంతో విద్యార్థులు సబ్జెక్టుల్లో మంచి స్కోర్ సాధించే అవకాశం కూడా కలుగుతుంది.
సీబీఎస్‌ఈ విద్యార్థులకు కూడా..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ సిలబస్ స్కూల్లలో కూడా ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నూతన విద్యావిధానానికి, ఎన్‌ఈపీకి అనుగుణంగానే 2024–25 విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల్లోనూ మార్పులు కూడా చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. కొత్త విధానంతో విద్యార్థుల ప్రిపరేషన్‌కు తగినంత సమయం దొరుకుతుందని, మంచి ప్రతిభ కనబర్చే అవకాశం ఉంటుందని విద్యాశాఖ తెలిపింది.
పరీక్షలు ఇలా..
కొత్త విద్యావిధానం ప్రకారం నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య టెన్త్, ఇంటర్ విద్యార్థులకు మొదటిసారి పరీక్ష నిర్వహిస్తారు. మార్చి–ఏప్రిల్ మధ్య మరోసారి పరీక్ష ఉంటుంది. ఏడాదికి రెండుసార్లు పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి. కొత్త కరికులమ్, ఫ్రేమ్‌వర్క్ తయారీకి కేంద్రం గత ఏప్రిల్‌లోనే ముసాయిదా విడుదల చేసింది.