Tirupati Prasadam: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందని వెల్లడించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రముఖులు, పండితులు వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. మెట్లు కడిగి పూజ కూడా చేశారు డిప్యూటీ సీఎం. అసలు తిరుమలలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఎన్ని రకాల ప్రసాదాలు పెడుతారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వెంకటేశ్వర స్వామి వారి కైంకర్యాలు..
వెంకటేశ్వర స్వామికి బాగా ఇష్టమైనవి ప్రసాదం లడ్డూ. అంతేకాదు ఆ స్వామి వారికి రోజుకో వెరైటీ చొప్పున వివిధ రకాల ప్రసాదాలు నైవేద్యంగా పెడతారట. అలంకారప్రియుడిగా, ఉత్సవ ప్రియుడు, నైవేద్య ప్రియుడుగా భక్తులు స్వామి వారిని పిలుచుకుంటారు. అయితే ఆ వెంకటేశ్వర స్వామికి రాజుల కాలం నుంచి అనేక రకాల పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. చాలా మంది రాజులు ఆ స్వామి వారికి ఎంత ఆస్తి రాసిచ్చారో ఆలయంలో శాసనాలపై చెక్కి ఉంది. 1933 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన దగ్గర నుంచి నిష్ఠగా వెంకటేశ్వర స్వామికి త్రికాల నైవేద్యం పెడుతున్నారు.
నైవేద్య సమయాలు..
నైవేద్యాలను పెట్టే సమయాలను మూడు భాగాలుగా విభజించారట. వాటిని మొదటి గంట, రెండో గంట, మూడో గంట అంటూ పిలుస్తుంటారు. ఆది, సోమ, మంగళ, బుధ, శని వారాల్లో ఆ స్వామి వారికి సమర్పించే నైవేద్య సమయాలు ఒకే మాదిరిగా ఉంటాయి. గురు, శుక్రవారాల్లో మాత్రం రెండో గంట లో నైవేద్యం సమర్పిస్తారు. అయితే స్వామి వారికి తొలి నివేదన ఉదయం 5.30 గంటలకు ఉంటుంది. రెండో గంట ఉదయం 10 గంటలకు ఉంటుంది. మూడో గంట రాత్రి 7.30 నిమిషాలకు నివేదించారు. గురు, శుక్రవారాల్లో రెండో గంట ఉదయం 7.30 నిమిషాలకు నైవేద్యం స్వామి వారికి సమర్పిస్తారు.
ప్రసాదాలు ఇవే..
ప్రతి రోజూ ఉదయం 5.30 నిమిషాలకు అంటే మొదటి గంట సమయంలో శ్రీవారికి నైవేద్యం పెడతారు. అందులో చక్రపొంగలి, కదంబం, పులిహోర, దద్దోజనం, మాత్ర ప్రసాదాలతో పాటు, లడ్డూలు, వడలు సమర్పిస్తారు. తరువాత వాటిని బేడి ఆంజనేయస్వామివారితోపాటు ఆలయంలోని ఉపాలయాలకు పంపిస్తుంటారట. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే రెండో గంటలో చక్రపొంగలి, పులిహోర, పెరుగన్నం, మిర్యాల పొంగలి, సీర, సేకరబాద్ నైవేద్యంగా పెడుతుంటారు. రాత్రి 7.30కు మూడవ గంటలో కదంబం, తోమాల దోశలు, లడ్డూలు, వడలను నివేదిస్తుంటారు.
ప్రత్యేక ప్రసాదాలు..
ఆదివారం ప్రత్యేకంగా ప్రసాదం ఉంటుంది. గరుడ ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన పిండిని స్వామివారికి ఈ రోజున సమర్పిస్తుంటారు. సోమవారం విశేష పూజ సందర్బంగా మరిన్ని ఎక్కువ ప్రసాదాలు ఉంటాయి. 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 51 పెద్ద దోశలు, 102 చిన్న అప్పాలను దేవుడికి ప్రసాదంగా పెడుతుంటారు. మంగళవారం ప్రత్యేకంగా మాత్ర ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. బుధవారం ప్రత్యేకంగా పాయసం, పెసరపప్పును ఉంటుంది. గురువారం జిలేబి, మురుకు, పాయసాలను పెడుతారు. శ్రీవారికి అభిషేక సేవ జరిగే శుక్రవారం ప్రత్యేకంగా పోళీలు ఉంటాయి. ఇక శనివారం పులిహోర, దద్దోజనం, మిర్యాలపొంగలి, కదంబం, చక్రపొంగలి, లడ్డూలు, వడలు, సీర, సేకరాబాద్, కదంబం, మొల హోర, తోమాల దోశలను సమర్పిస్తుంటారు.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More