Nellore TDP: నెల్లూరు జిల్లా( Nellore district) టిడిపిలో కొత్త ముసలం. ఏ నాయకుడు చేరికతో టిడిపికి కలిసి వచ్చిందో.. అదే నాయకుడు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జిల్లాలో ఓ సీనియర్ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టు పరిస్థితి మారింది. ఇది ఇలానే కొనసాగితే విభేదాలు ముదరడం ఖాయం. ఎన్నికల్లో జిల్లాలో టిడిపి కూటమి క్లీన్ స్వీప్ చేసింది. పదికి పది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. జిల్లా నుంచి పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు పదవులు ఆశించారు. కానీ దక్కలేదు. అయినా సరే చంద్రబాబు భరోసా ఇవ్వడంతో సంతృప్తిగా ముందుకు సాగుతున్నారు. ఇటువంటి తరుణంలో నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలు.. మంత్రి నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య దూరం పెంచుతున్నాయి. రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సిటీ నియోజకవర్గం నుంచి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ రెండు నియోజకవర్గాలు కలిపి నెల్లూరు కార్పొరేషన్ గా ఉంది. కార్పొరేషన్ పై ఆధిపత్యం విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నట్లు సమాచారం.
* రెండు నియోజకవర్గాల్లో సమానంగా
నెల్లూరు కార్పొరేషన్( Nellore Corporation) కు సంబంధించి.. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 28 డివిజన్లు ఉన్నాయి. రూరల్ నియోజకవర్గంలో 26 కొనసాగుతున్నాయి. దాదాపు సమానం అన్నమాట. అయితే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ( Minister Narayana) పురపాలక శాఖను నిర్వర్తిస్తున్నారు. సహజంగానే నెల్లూరు సిటీపై తన మార్కు ఉండేలా చూసుకుంటారు. ఇప్పుడు అదే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసంతృప్తి కారణం. చాలా అంశాల్లో నారాయణతో కోటంరెడ్డి విభేదిస్తున్నారు. కార్పొరేషన్ కు సంబంధించి పన్నుల వసూలు, అధికారుల, ఉద్యోగుల బదిలీలతోపాటు కీలక నిర్ణయాల్లో నారాయణ మాట చెల్లుబాటు అవుతోంది. అది సహజంగానే కోటంరెడ్డికి రుచించడం లేదు. దీంతో విభేదించడం ప్రారంభించారు. మంత్రి నారాయణ దూకుడు మీద వెళ్తుండడంతో కోటంరెడ్డి సైతం తాడోపేడోకు సిద్ధపడుతున్నారు.
* ఇద్దరూ అవసరమే
తెలుగుదేశం పార్టీ( TDP) నాయకత్వానికి ఇద్దరు నేతలు అవసరమే. అందుకే ఎవరినీ సముదాయించలేక హై కమాండ్ సైలెంట్ గా ఉంది. నారాయణ సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నారు. 2014 వరకు ఆయన తెరవెనుక సాయం చేశారు. అందుకే అప్పట్లో అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. తరువాత ఎమ్మెల్సీని చేసి ఆయనను కొనసాగించారు. 2019 ఎన్నికల్లో తొలిసారిగా నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశారు నారాయణ. అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. గత ఐదేళ్లుగా జగన్ సర్కార్ నారాయణను టార్గెట్ చేసుకుంది. కానీ నారాయణ మాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే కొద్ది రోజులు రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఎన్నికలకు ముందు తిరిగి యాక్టివయ్యారు. నెల్లూరు నగరం నుంచి మరోసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్లో కీలక మంత్రి పదవి చేపడుతున్నారు.
* కోటంరెడ్డి హ్యాట్రిక్ విజయం
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( Sridhar Reddy) సీనియర్ రాజకీయ నేత. సుదీర్ఘ నేపథ్యం ఉంది. మాస్ లీడర్ గా ఎదిగారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అధినేత జగన్ పట్ల వీర విధేయత ప్రదర్శిస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో రెండోసారి నెల్లూరు రూరల్ నుంచి గెలిచేసరికి మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. పైగా జగన్ ప్రాధాన్యత తగ్గించడంతో.. ఆయనతో పాటు వైసీపీని విభేదించడం ప్రారంభించారు. తన పదవీకాలం 16 నెలల పాటు ఉండగానే అసంతృప్తి స్వరం వినిపించారు. తెలుగుదేశం పార్టీ అనుకూల వాతావరణాన్ని నెల్లూరు జిల్లాలో క్రియేట్ చేశారు. అయితే ఈ ఇద్దరు నేతలు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వేలు పెట్టకూడదని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట మంత్రి నారాయణ కు. కానీ ఆయన పట్టించుకోవడం లేదు. దీంతో నెల్లూరులో తెలుగుదేశం విభేదాలు ఏ స్థాయికి చేరుకుంటాయో చూడాలి.