Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహార శైలి అధికార పార్టీలో చర్చకు దారితీసింది? ఆయనతో టీడీపీ నేతలు వేదిక పంచుకోవడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారా? దానిపై వివరణ అడిగారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నూజివీడులో జరిగింది. కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్థసారథి, సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, పార్టీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు తదితరులు హాజరయ్యారు. అదే కార్యక్రమానికి మాజీ మంత్రి జోగి రమేష్ కూడా వచ్చారు. ఓపెన్ టాప్ జీపులో ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో సైతం టిడిపి నేతలతో పాటే జోగి రమేష్ పాల్గొన్నారు. దీనిపై పెద్ద ఎత్తున రచ్చ నడిచింది. టిడిపి సోషల్ మీడియా విభాగంలో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. దీనిపై మంత్రి లోకేష్ స్పందించినట్లు తెలుస్తోంది. వివరణ ఇవ్వాలని మంత్రి కొలుసు పార్థసారథికి ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది.
* రాజకీయాలకు అతీతంగా ఆహ్వానాలు
నూజివీడులో గౌడ సంఘం ఆధ్వర్యంలో లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆవిష్కరణ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా ఆ సంఘ ప్రతినిధులను ఆహ్వానించారు. అందులో భాగంగానే మంత్రి కొలుసు పార్థసారథి తో పాటు ఎమ్మెల్యే గౌతు శిరీషను ఆహ్వానించింది గౌడ సంఘం. అదే సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ కు సైతం ఆహ్వానం పంపారు. ఈ తరుణంలోనే ఆయన హాజరయ్యారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించారు. అన్ని రాజకీయ కోణంలోనే చూడవద్దని విజ్ఞప్తి చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం జోగి రమేష్ తో టిడిపి నేతలు వేదిక పంచుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
* గతంలో దూకుడుతోనే
వైసీపీ హయాంలో జోగి రమేష్ దూకుడుగా వ్యవహరించేవారు. ఒకానొక దశలో చంద్రబాబు నివాసం పై దండెత్తారు కూడా. ఆ తరువాతనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు జగన్. కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జోగి రమేష్ స్వరంలో ఒక రకమైన మార్పు వచ్చింది. చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించి కేసును తెరపైకి తెచ్చారు. మరోవైపు ఆయన కుమారుడిపై అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కేసు నమోదు అయింది. అరెస్టులు కూడా జరిగాయి.ఈ తరుణంలో జోగి రమేష్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వైసిపి కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. కానీ వైసీపీ హయాంలో జోగి రమేష్ వ్యవహార శైలి పై ఇప్పటికీ టిడిపి శ్రేణులు పడుతూనే ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో టిడిపి నేతలు జోగి రమేష్ తో వేదిక పంచుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతో లోకేష్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది.