CM Jagan: అంగన్వాడి కార్మికుల సమ్మె విషయంలో జగన్ తొందరపడ్డారా? గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నారా? దుందుడుకు చర్యలతో ఒక్కో వర్గాన్ని దూరం చేసుకుంటున్నారా? ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులు సైతం తప్పుపడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత పెరగడానికి సీఎం జగన్ వైఖరి కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.గత నాలుగు సంవత్సరాలుగా ఆయనలో అదే వైఖరి కనిపిస్తోంది. పార్టీకి జగనే బలం.. ఆయనే బలహీనత అన్నట్టు పరిస్థితి మారింది.
నిన్నటి వరకు తనను చూసి ప్రజలు ఓటేస్తారని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాట మార్చారు. తనతో పాటు మీరు బాగుంటేనే ప్రజలకు గుర్తిస్తారని చెప్పడం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. దాదాపు సగానికి పైగా అభ్యర్థులను మార్చేస్తానని చెప్పుకొస్తున్నారు. అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఏక్ నిరంజన్ మాదిరిగా.. ఎవరి ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలను బాధ్యులు చేస్తున్నారు. రేపు పొద్దున్న ఎన్నికల్లో ఓడినా, గెలిచినా అందుకు సీఎం జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
వాస్తవానికి అంగన్వాడి కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. గత నాలుగేళ్ల నుంచి అడుగుతున్నవే మరోసారి రిపీట్ చేస్తున్నారు. ఎన్నికల ముంగిట కనికరించి తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నారు. ఆర్థికపరమైన అంశమే అయినా సున్నితంగా పరిష్కరించడానికి అవకాశం ఉంది. సిపిఎస్ రద్దు హామీ, పిఆర్సి విషయంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇష్టం లేకున్నా బలవంతంగా ఒప్పించారు. ఇప్పుడు అంగన్వాడీ కార్మికుల విషయంలో అదే ఫార్ములాను అనుసరించిన కొంత సమస్య పరిష్కారం అయ్యేది. కానీ ఏకంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగులుగొట్టించి సమస్యను మరింత జఠిలం చేశారు. ఎన్నికల ముంగిట వారితో వివాదం పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఏ వర్గాల నుంచి అభిమానం పొంది అధికారంలోకి రాగలిగారో… వారందరినీ దూరం చేసుకుంటున్నారు.