Sonia Gandhi: అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో.. లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫోకస్ పెట్టారు. ఈమేరకు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. పార్లమెంట్ స్థానాల్లో గెలిచేందుకు ఏకంగా పార్టీ జాతీయ నాయకురాలిని రంగంలోకి దింపాలని తీర్మానం చేశారు. ఎమర్జెనీలో కాంగ్రెస్ ప్రతిష్ట మసకబారిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి దక్షిణ భారత దేశమే పూర్వ వైభవం తెచ్చింది. ఇందిరాగాంధీ మెదక్ లోక్‌సభ నుంచి పోటీ చేసి పార్టీని కేంద్రంలో అధికారంలోకి తెచ్చారు. ఇందిరా రెండోసారి ప్రధాని అయ్యారు. ఇక తాజాగా పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరమైన పార్టీని తిరిగి ఈసారి ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని నేతలు భావిస్తున్నారు. ఈసారి కూడా దక్షిణ భారత దేశం నుంచే బరిలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగానే పార్టీ అగ్రనేత సోనియాగాంధీని రంగంలోకి దించే ఎత్తుగడ వేస్తోంది.
అసెంబీ తరహాలో..
క్రికెట్లో సూపర్ సిక్స్ కొట్టినట్లుగా ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ సీట్లపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఫలితాల తరహాలోనే లోక్ సభ స్థానాలను అత్యధిక సంఖ్యలో గెలుచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏకంగా పార్టీ కీలక నాయకురాలు, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని తెలంగాణలో పోటీ చేయాలని తీర్మానించారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ తీర్మానం చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసినట్లుగా ..ఇప్పుడు సోనియాగాంధీ కూడా తెలంగాణలోని ఏదో ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని హస్తం పెద్దలు తీర్మానించారు.
మెదక్ లేదా మల్కాజ్‌గిరి..
దక్షిణ భారత దేశంలో వరుసగా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆరు నెలల క్రితం కర్ణాటకలో విజయ పతాకం ఎగురవేసింది. తాజాగా తెలంగాణలో అధికారం చేపట్టింది. అదే జోష్ ను కొనసాగిస్తోంది. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ జాతీయ నాయకురాలు సోనియాగాంధీ పోటీ చేయాలని తీర్మానించారు. గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ లేదా.. అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్‌గిరి నుంచి బరిలో దించాలని యోచిస్తున్నారు. మెదక్ నుంచి బరిలో దిగితే ఇందిరాగాంధీ లెగసీని కొనసాగించవచ్చని భావిస్తోంది.
మెదక్ నుంచి కేసీఆర్..
మెదక్ నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కూడా పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో ఆశించిన మెజారిటీ రాకపోయినా నెగెటివ్ ప్రచారం జరిగే అవకాశం ఉంది. కేసీఆర్ మెదక్ నుంచి పోటీచేస్తే.. సోనియాగాంధీని కాంగ్రెస్ కంచుకోట మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయించాలని భావిస్తోంది. గతంలో ఇక్కడి నుంచి సర్వే సత్యనారాయణ, మొన్నటి వరకు రేవంత్‌రెడ్డి ఎంపీగా ఉన్నారు. 2024 సోనియాగాంధీని పోటీ చేయించే యోచన కూడా చేస్తున్నారు.