Chandrababu: రఘురామ కోసం చంద్రబాబు అంత పని చేశారా?

రఘురామ విషయంలో చంద్రబాబు పక్కా వ్యూహంతోనే అడుగులు వేశారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎంపీగా గెలిచారు రఘురామ. పార్టీ హై కమాండ్ కు వ్యతిరేకించి.. టిడిపికి అస్త్రాలు అందించారు. రాజకీయ ప్రత్యర్థులకు మించి జగన్ పై రఘురామ గట్టిగానే పోరాడారు.

Written By: Dharma, Updated On : April 20, 2024 11:06 am

Chandrababu

Follow us on

Chandrababu: రఘురామకృష్ణంరాజుకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఉండి టిడిపి అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేశారు.అయితే ఈ ఎన్నికల్లోతాను ఎలాగైనా పోటీ చేస్తానని రఘురామకృష్ణం రాజు ఇంతకుముందే ప్రకటించారు. నరసాపురం ఎంపీ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీచేయాలని రఘురామ భావించారు. కానీ అనూహ్యంగా టిక్కెట్ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు దక్కింది. దీని వెనుక జగన్ ఉన్నారని.. నాకు టికెట్ తగ్గకుండా చేయడంలో విజయం సాధించారని స్వయంగా రఘురామ ప్రకటించారు. ఆ సందర్భంలోనే జగన్ కు సవాల్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని.. తానంటే ఏమిటో నిరూపిస్తానని సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ దక్కించుకొని అన్నట్టుగానే జగన్ కు గట్టి సవాల్ పంపారు.

రఘురామ విషయంలో చంద్రబాబు పక్కా వ్యూహంతోనే అడుగులు వేశారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎంపీగా గెలిచారు రఘురామ. పార్టీ హై కమాండ్ కు వ్యతిరేకించి.. టిడిపికి అస్త్రాలు అందించారు. రాజకీయ ప్రత్యర్థులకు మించి జగన్ పై రఘురామ గట్టిగానే పోరాడారు. చివరకు తన సొంత నియోజకవర్గం నరసాపురానికి కూడా దూరమయ్యారు.సిఐడి కేసులను ఎదుర్కొన్నారు.తనపై పోలీసులు చేయి చేసుకున్నారని కూడా రఘురామ స్వయంగా ప్రకటించుకున్నారు.అయితే అటువంటి రఘురామకు టికెట్ ఇవ్వకుంటే అది జగన్ విజయం అవుతుందని చంద్రబాబు భావించారు.అందుకే నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారు. అవసరమైతే ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని బిజెపికి విడిచిపెడతామని.. దాని బదులు నరసాపురం తమకు వదిలివేయాలని కోరారు. బిజెపి నుంచి సానుకూలత రాకపోవడంతో అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఉండి అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నారు.ఆయన స్ట్రాంగ్ పొజిషన్లోనే ఉన్నారు.గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం గెలుపొందారు.ఎన్నికల్లో తప్పనిసరిగా గెలుస్తారని కూడా సర్వేలు తేల్చి చెప్పాయి.కానీ అనూహ్యంగా రఘురామకృష్ణంరాజు కోసంమంతెన రామరాజు తప్పుకున్నారు.ఆయన టిడిపి జిల్లా అధ్యక్ష పదవితో పాటు భారీగా ఆర్థిక ప్రయోజనం పొందినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే తన స్థానాన్ని వదులుకున్నారంటే.. దాని వెనుక భారీ ప్రయోజనం ఉందని.. పైగా ఎటువంటి నిరసనలు, ఆందోళనలు లేకుండా మంతెన రామరాజు రఘురామకృష్ణం రాజుకు అండగా నిలబడతానని ప్రకటించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మొత్తానికైతే రఘురామకృష్ణం రాజు పట్టు పట్టి మరి సీటు సాధించారు. జగన్ కు గట్టి సవాల్ విసరగలిగారు.