SRH Vs DC: హోరాహోరి మ్యాచ్ లో గెలిచేదెవరో?

హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో అదరగొడుతోంది. బలమైన చెన్నై, ముంబై, బెంగళూరు జట్లను ఓడించి హైదరాబాద్ సత్తా చాటింది. ముంబై పై 277, బెంగళూరు పై 287 రికార్డు స్థాయిలో పరుగులు చేసి ప్రత్యర్థి జట్లకు డేంజర్ సిగ్నల్స్ పంపించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 20, 2024 11:14 am

SRH Vs DC

Follow us on

SRH Vs DC: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా మరో ఉత్కంఠ భరితమైన మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో వరుస విజయాలతో జోరు మీద ఉన్న హైదరాబాద్.. ఢిల్లీ జట్లు తలపడబోతున్నాయి. ఈ రెండు జట్లలో హైదరాబాద్ కాస్త బలంగా కనిపిస్తున్నప్పటికీ.. ఢిల్లీని నమ్మడానికి లేదు. ఎందుకంటే గత రెండు మ్యాచ్ లలో ఆ జట్టు అసాధారణ ఆట తీరు ప్రదర్శించింది.. ఈ టోర్నీలో ఊహించని స్థాయిలో పుంజుకుంది. దీంతో శనివారం రాత్రి హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో ఒకవేళ హైదరాబాద్ గెలిస్తే పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి వెళుతుంది ఢిల్లీ గెలిస్తే నెట్ రన్ రేట్ మెరుగుపరచుకొని లక్నో స్థానాన్ని ఆక్రమిస్తుంది. అప్పుడు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలను మరింత సుస్థిరం చేసుకుంటుంది. కాబట్టి.. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం.

హైదరాబాద్

హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో అదరగొడుతోంది. బలమైన చెన్నై, ముంబై, బెంగళూరు జట్లను ఓడించి హైదరాబాద్ సత్తా చాటింది. ముంబై పై 277, బెంగళూరు పై 287 రికార్డు స్థాయిలో పరుగులు చేసి ప్రత్యర్థి జట్లకు డేంజర్ సిగ్నల్స్ పంపించింది. సీజన్ లో ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడిన హైదరాబాద్ నాలుగు విజయాలతో టాప్ -4 స్థానంలో కొనసాగుతోంది. సొంత మైదానంలో ఢిల్లీ జట్టుతో ఆడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. హైదరాబాద్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, హెడ్, క్లాసెన్, మార్క్రం, సమద్, నితీష్ రెడ్డి భీకరమైన ఫామ్ లో ఉన్నారు. గత నాలుగు మ్యాచ్ లలో వీరు స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడారు. ఫలితంగా హైదరాబాద్ స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. బ్యాటింగ్ పరంగా పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ.. మిగతా ఆటగాళ్లు కూడా ఫామ్ లోకి రావాలని జట్టు భావిస్తోంది. బౌలింగ్ విభాగంలో కెప్టెన్ కమిన్స్ తప్ప మిగతావారు ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో అదే జరిగింది. స్కోర్ భారీగా ఉంది కాబట్టి జట్టు గెలవగలిగింది. లేకుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. మయాంక్ మార్కండే వికెట్లు తీసినప్పటికీ పరుగులు భారీగా ఇస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ తన లయను దొరకబుచ్చుకోవాల్సి ఉంది. అభిషేక్ శర్మ, నటరాజన్ వంటి వారు సత్తా చాటాల్సి ఉంది.

ఢిల్లీ

ఈ సీజన్లో ఢిల్లీ ప్రయాణం పడుతూ, లేస్తూ సాగుతోంది. ప్రారంభ మ్యాచ్లో పంజాబ్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ..కోల్ కతా చేతిలో పరాజయం పాలైంది. ముంబై ఇండియన్స్ పై కూడా అదే తీరుగా ఓడిపోయింది. ఆ తర్వాత లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో గెలుపు ట్రాక్ అందుకుంది. గుజరాత్ జట్టు జరిగిన మ్యాచ్ లోనూ అదే సక్సెస్ కంటిన్యూ చేసింది. మొత్తానికి ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన ఆ జట్టు మూడు విజయాలతో ఆరవ స్థానంలో కొనసాగుతోంది.

ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్, మెక్ గ్రూక్, అభిషేక్ పోరెల్ బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నారు. మిగతావారు కూడా టచ్ లోకి రావాలని ఆ జట్టు భావిస్తోంది. పృథ్వి షా నుంచి ఆ జట్టు మెరుగైన ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఇక బౌలింగ్ విభాగంలో ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, స్టబ్స్ సత్తా చాటుతున్నారు. ఇటీవల గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వీరు చెలరేగి బౌలింగ్ వేయడంతో 89 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఈ జట్టులో కులదీప్ యాదవ్ బౌలింగ్ లో మ్యాజిక్ చేస్తున్నాడు. అయితే హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లోనూ వీరు మెరుగైన బౌలింగ్ ప్రదర్శన చేయాలని ఢిల్లీ జట్టు ఆశిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 23 మ్యాచులు జరగగా హైదరాబాద్ 12సార్లు, ఢిల్లీ 11 సార్లు విజయం సాధించాయి. గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం హైదరాబాద్ జట్టుకు 52%, ఢిల్లీ జట్టుకు 48 శాతం విజయవకాశాలున్నాయి.

జట్ల అంచనా

హైదరాబాద్

హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రం, క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కమిన్స్ (కెప్టెన్), జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, మయాంక్ మార్కండే.

ఢిల్లీ

పృథ్వీ షా, రిషబ్ పంత్ (కెప్టెన్), కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్, డేవిడ్ వార్నర్, స్టబ్స్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, మెక్ గ్రూక్, అభిషేక్ పోరెల్, శై హాప్, నోర్ట్ జీ.