Jagan Mohan Reddy: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న విధంగా ఉంది ఏపీ బీజేపీ నేతల పరిస్థితి. హిందూ రాజకీయాలు చేయడంలో బిజెపి ముందు ఉంటుంది. అది దాయలేని సత్యం కూడా. కానీ ఏపీలో అదే హిందుత్వవాదంతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వైసిపి హయాంలో అపచారాలు జరిగినా అప్పట్లో నోరు తెరవలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తోంది. ఈ సమయంలో కూటమి భాగస్వామ్య పక్షంగా ఉన్న బిజెపి అనుకున్న విధంగా స్పందించడం లేదు. ఏదో మొక్కుబడి తంతు అన్నట్టు ఒకటి రెండు విమర్శలు చేసి సైలెంట్ కావడం ఏపీ బీజేపీ నేతలకు పరిపాటిగా మారింది. దాదాపు ఏడాదిగా తిరుమల కల్తీ నెయ్యి, పరకామణిలో దొంగతనాలు, అన్యమత ప్రచారాలపై తీవ్రస్థాయిలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య యుద్ధం జరుగుతోంది. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఆశించిన స్థాయిలో నోరు తెరవడం లేదు.
* వైసిపి అనుకూల ప్రచారం..
అసలు బిజెపి ఎందుకు సైలెంట్ గా ఉంటుందో తెలియడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనికి మరోలా అర్థం చెబుతోంది. ఇప్పటికీ తమకు బిజెపి మద్దతు ఉంటుందని సంకేతాలు ఇస్తోంది. బిజెపి కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ.. ఏపీ బీజేపీ నేతలు ఎందుకు మేల్కోవట్లేదు? అనేది ఒక ధర్మ సందేహమే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టు బిజెపి హై కమాండ్ కంట్రోల్ చేస్తుందా? అది వైసిపి, టిడిపి మధ్య వ్యవహారంగా భావిస్తుందా? అన్నది ఒక ప్రశ్న. అయితే కొద్ది రోజుల కిందట ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు ఇప్పుడు నోరు తెరిచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ కావడం మాత్రం.. పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మీద నుంచి ఆదేశాలు వచ్చాయి అంటూ సెటైర్లు పడుతున్నాయి.
* ఎట్టకేలకు సోము ఫైర్..
బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ” జగన్ అన్యమాతస్తుడు కనుక ఆయనకు స్వామివారి పట్ల భక్తి, నమ్మకం ఉండవు. అందుకే కిలో 320 రూపాయల చొప్పున కల్తీ నెయ్యి కొని ప్రసాదంలో వినియోగించారు. జగన్, బొత్స ఇళ్లలో ఆ కల్తీ నెయ్యిని వాడగలరా? అంటూ గట్టిగానే ప్రశ్నించారు సోము వీర్రాజు. వైసీపీ సభ్యులు చెప్పులు, బూట్లు ధరించి శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాలు, ప్రతిమలు పట్టుకొని మండలి లోకి వచ్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వ హయాంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అన్ని అపచారాలు చేసి… ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా అంత ధైర్యంగా కల్తీ నెయ్యి పేరుతో తిరుమల స్వామి వారితో రాజకీయాలు చేస్తున్నారని సోము వీర్రాజు అనడం మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అయితే ఇన్ని రోజులు సోము వీర్రాజుకు తెలియదా? అనే సెటైర్లు పడుతున్నాయి.
జగన్… వెంకటేశ్వర స్వామి, హిందుత్వo మీద మీకు చులకన భావం వుందా?#SomuVeerraju pic.twitter.com/CrQCsHnq45
— M9 NEWS (@M9News_) February 20, 2026