Dharmana Prasada Rao strong decision : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress party)సీనియర్లు కొందరు ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది సైలెంట్ అయ్యారు. అయితే పార్టీకి ఇక భవిష్యత్తు లేదని భావించిన చాలామంది గుడ్ బై చెప్పారు. పార్టీలో నెంబర్ 2 స్థాయికి ఎదిగిన విజయసాయిరెడ్డి లాంటి నేతలు కూడా వెళ్ళిపోయారు. అయితే దశాబ్దాలుగా రాజకీయాలు చేసిన వారు మాత్రం సిద్ధాంత పరంగా వేరే పార్టీలో చేరలేకపోయారు. అటువంటి వారిలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఒకరు. ఎన్నికల ఫలితాలు అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలా? వేరే పార్టీలో చేరాలా? అని గట్టిగానే ఆలోచన చేశారు ధర్మాన. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన టిడిపిలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. ఇప్పుడు అనూహ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగేలా సంకేతాలు ఇచ్చారు. దీంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కలుగుతోంది.
Also Read : ఉత్తరాంధ్ర మంత్రుల్లో ఆ ఒక్కరు ఎవరు?
* సీనియర్ మోస్ట్ లీడర్..
ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ ధర్మాన ప్రసాదరావు( dharmana Prasad Rao ). వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సన్నిహిత నేత. అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలిసారి మంత్రి కూడా అయ్యారు. 1989 ఎన్నికల్లో నరసన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో సైతం విజయం సాధించారు. తరువాత 2004లో శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచి వైయస్ రాజశేఖర్రెడ్డి క్యాబినెట్లో రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2009లో సైతం గెలిచి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ ను విభేదించి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు కానీ.. అటువైపు వెళ్లలేదు. అయితే 2014 ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో రెండోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కొద్దిరోజుల పాటు సైలెంట్ గా ఉన్నారు. విస్తరణలో ఆయనకు మంత్రి పదవి లభించింది. 2024 ఎన్నికల్లో మూడోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి రాజకీయ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
* దారుణ ఓటమితో మనస్థాపం
2024 ఎన్నికల్లో ధర్మాన ప్రసాద్ రావు దారుణంగా ఓడిపోయారు. ఒక సామాన్య సర్పంచ్ చేతిలో 52 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో చాలా బలం ఉంది. అదే ధర్మాన ప్రసాదరావుకు పునరాలోచనలో పడేసింది. వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఆ మధ్యన ప్రచారం జరిగింది. తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం టిడిపిలో చేరుతారని పెద్ద ఎత్తున టాక్ నడిచింది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి సరైన ఆఫర్ రాకపోవడంతో ధర్మాన మరింత సైలెంట్ అయినట్లు సమాచారం. బిజెపి నుంచి ఆహ్వానం ఉన్న.. ఆ పార్టీకి సరైన బలం లేదు. అందుకే ధర్మాన ప్రసాదరావు డిఫెన్స్ లో పడ్డారు. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* పార్టీ శ్రేణులతో సమావేశం..
ఏపీలో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి జూన్ 4 నాటికి ఏడాది అవుతుంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఆ రోజున వెన్నుపోటు దినం గా జరుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న ధర్మాన ప్రసాదరావు వెన్నుపోటు దినాన్ని నియోజకవర్గంలో నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. పార్టీ శ్రేణులతో సమావేశమై కీలక ఆదేశాలు ఇచ్చారు. దీంతో పెద్దాయన పార్టీలో యాక్టివ్ అయ్యారన్న చర్చ ప్రారంభం అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది.