Pawan Kalyan: పవన్ ఫుల్ టైం రాజకీయ నాయకుడిగా మారనున్నారా? ఇకనుంచి పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర క్యాబినెట్లో పవన్ చేరిక ఖాయంగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు హోంశాఖ తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో జనసేన శాసనసభాపక్ష నేతగా కూడా పవన్ ఎన్నికయ్యారు. పార్టీ తరఫున ఎన్నికైన 20 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా బలపరిచారు. దీంతో ఫుల్ టైం రాజకీయాలకు పవన్ అంకితమవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఒక పార్టీకి శాసనసభ పక్ష నాయకుడు అంటే పూర్తి సమయం కేటాయించాల్సి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కచ్చితంగా ఆ పార్టీకి ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ తీసుకునే ఈ బాధ్యతలను బట్టి చూస్తే ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాల్లో కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పెండింగ్ సినిమాలను పూర్తి చేసి.. రాజకీయాలపై దృష్టి పెడతారని స్పష్టమవుతోంది. అసలు రాష్ట్ర క్యాబినెట్లో పవన్ చేరరని ప్రచారం జరిగింది. మిగతా వారితో రాజకీయాలు నడిపిస్తారని టాక్ నడిచింది. కానీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికతో పాటు డిప్యూటీ సీఎం తో పాటు కీలక మంత్రిత్వ శాఖను తీసుకుంటారని తాజాగా తెలుస్తోంది.
రాష్ట్ర క్యాబినెట్లో జనసేనకు నాలుగు మంత్రి పదవులు దక్కుతాయని సమాచారం. పవన్ కళ్యాణ్ హోంశాఖతో పాటు ఏకైక డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకుంటారని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు తన క్యాబినెట్లో ఇద్దరికీ డిప్యూటీ సీఎం పోస్టులు ఇచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఐదుగురికి డిప్యూటీ సీఎం పోస్టులు ఇచ్చారు. కానీ ఈసారి పవన్ ఒక్కరికే డిప్యూటీ సీఎం పోస్ట్ కట్టబెట్టాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు బిజెపికి రెండు మంత్రి పదవులు కేటాయించేందుకు చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. కేంద్రంలో రెండు మంత్రి పదవులు దక్కినందుకు.. అదే సంఖ్యలో బిజెపికి ఇవ్వాలని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.