Deputy CM Pawan Kalyan: పశ్చిమగోదావరి జిల్లాలో( West Godavari district) పేకాట శిబిరాల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా ఉన్నారు. భీమవరం డిఎస్పి పై చర్యలకు ఆదేశించారు. బిజెపితోపాటు హోంమంత్రి అనితకు సైతం సమాచారం ఇచ్చారు. అయితే ఓ డిఎస్పి పై డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఎందుకు స్పందించారు అన్నది ఇప్పుడు ప్రశ్న. అయితే పేకాట శిబిరాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండడం, సివిల్ కేసులలో సైతం తల దూర్చుతుండడంతో డి.ఎస్.పి పై బదిలీ వేటు వేసేందుకు పోలీస్ శాఖ నిర్ణయించింది. కానీ ఓ కూటమి ఎమ్మెల్యే అడ్డు తగలడంతో పవన్ స్పందించాల్సి వచ్చిందట. అయితే తాజాగా డీఎస్పీపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో.. ఆ డీఎస్పీ వెనుకేసుకొచ్చిన సదరు ఎమ్మెల్యే ఎవరు అనేది ఇప్పుడు కొత్త చర్చ.
* పవన్ కు ఫిర్యాదులు..
పశ్చిమగోదావరి జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. భీమవరం( Bhimavaram), తాడేపల్లి, నరసాపురం నుంచి రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాసరావు, బొమ్మిడి నాయకర్ గెలిచారు. ఉండిలో రఘురామకృష్ణంరాజు, ఆచంటలో పితాని సత్యనారాయణ, తణుకులో రాధాకృష్ణ, పాలకొల్లులో మంత్రి రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ ఏడుగురిలో ఒకరు పవన్ కోపానికి కారణం అని తెలుస్తోంది. అయితే ఎవరనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ ఏడుగురిలో ఒకరు ఆ డీఎస్పీకి కొమ్ముకాసినట్లు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే ధైర్యంతోనే ఆయన విచ్చలవిడిగా వ్యవహరించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ కు సమాచారం అందడంతో ఆ ఎమ్మెల్యేతో మాట్లాడకుండా.. నేరుగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి డీఎస్పీపై వివరణ కోరారు పవన్ కళ్యాణ్.
* ఆ ఒక్కరూ ఎవరు? జనసేనలో( janasena ) ఉన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ కు వీర విధేయులు. పైగా పార్టీ ఆదేశాల మేరకు ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక మంత్రి నిమ్మల రామానాయుడు విషయంలో మరో ఆలోచన ఉండదు. ఆయన సైతం పవన్ కళ్యాణ్ కు గౌరవం ఇస్తూ వచ్చారు. పవన్ సైతం రామానాయుడు విషయంలో ప్రత్యేక అభిమానంతో ఉంటారు. ఇక మిగిలింది రఘురామకృష్ణంరాజు, పితాని సత్యనారాయణ, రాధాకృష్ణ ఉన్నారు. ఆ ముగ్గురు సైతం పవన్ కళ్యాణ్ పట్ల గౌరవం గానే ఉంటారు. అయితే డిఎస్పి వ్యవహార శైలి సరిగా లేకపోవడంతోనే పవన్ సీరియస్ అవ్వాల్సి వచ్చిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
* బదిలీ సైతం అడ్డగింత..
సదరు డీఎస్పీని పోలీస్ శాఖ( police department) ఎప్పుడో బదిలీ చేసింది. కానీ ఆ ఎమ్మెల్యే అడ్డుకున్నారు అన్నది ప్రధాన ఆరోపణ. పైగా వైసీపీ హయాంలో గన్నవరం డిఎస్పీగా ఉండేవారు. అప్పట్లో వైసీపీకి విధేయత గా ఉండేవారని ప్రచారం ఉంది. అదే డీఎస్పీని భీమవరం తేవడం వెనుక ఒక ఎమ్మెల్యే హస్తం ఉంది. ఆపై డీఎస్పీ చేపట్టే వ్యవహారాలన్నింటి వెనుక ఆ ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అయితే నేరుగా ఆ ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే ఇబ్బందులు వస్తాయని తెలిసి.. పవన్ కళ్యాణ్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆపై హోంమంత్రి తో పాటు డీజీపీకి సైతం సమాచారం ఇవ్వాలని డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులకు సైతం సూచించినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ కోపానికి కారణమైన ఎమ్మెల్యే ఎవరు అనేది మాత్రం తెలియడం లేదు.