Pawan Kalyan Hanuman Project launch: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) తన శాఖల విషయంలో వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏరి కోరి తనకు ఇష్టమైన శాఖలను తీసుకున్నారు. వాస్తవానికి ఆయన హోం శాఖ వంటి పెద్ద మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తారని భావించారు. కానీ ఆయన మాత్రం పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ, పర్యావరణ శాఖ వంటి వాటిని మాత్రమే కోరుకున్నారు. అయితే కూటమి రెండేళ్ల పాలనలో పవన్ కళ్యాణ్ శాఖల విషయంలో ప్రగతి బాగుంది. తాను నిర్వర్తిస్తున్న శాఖల్లో అభివృద్ధిని చేసి చూపిస్తున్నారు. ప్రత్యేక గుర్తింపును కూడా సాధించారు. అయితే ఇప్పుడు ఆయన మరో వినూత్న ఆలోచన చేసి అమలు చేయడం ప్రారంభించారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖకు ప్రత్యేక అంబులెన్స్ లను, వాహనాలను సమకూర్చారు. వాటిని ఈరోజు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో వాటిని ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
100 వాహనాలు
ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు( Hanuman project) కింద 100 వాహనాలను కేటాయించారు. వివిధ ప్రమాదాల్లో గాయపడిన వన్యప్రాణులను తక్షణం రక్షించేందుకు వీలుగా.. మానవ, వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు ఈ వాహనాలను ఉపయోగించనున్నారు. అయితే అత్యాధునికంగా రూపొందించారు ఈ అంబులెన్స్లను. వాటిలో జంతువులను తరలించేందుకు హైడ్రాలిక్ లిఫ్టులు, అత్యవసర శస్త్ర చికిత్స పరికరాలు, మందులు, రక్త పరీక్షల కోసం మైక్రోస్కోపులు, రెస్క్యూ గేర్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలోనే చికిత్స అందించే మొబైల్ వెటర్నరీ సేవలు కూడా అందుబాటులో ఉంచారు.
తక్షణం సాయం..
హనుమాన్ ఫౌండేషన్( Hanuman Foundation) ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా.. వన్యప్రాణులకు ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపడతారు. ఒకవేళ వన్యప్రాణులతో ఎవరికైనా నష్టం జరిగితే పరిహారం కూడా అందిస్తారు. గతంలో వన్యప్రాణుల చేతిలో గాయపడి, మృతి చెందిన వారి విషయంలో చాలా ఆలస్యం జరిగేది పరిహారం అందించడంలో. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణి దాడుల్లో గాయపడి, మృతి చెందిన వారికి రూ. 4 కోట్ల పరిహారం అందించారు. కేవలం అంబులెన్స్ లే లేదు కాదు. అటవీ శాఖ అధికారులకు ప్రత్యేక వాహనాలను కూడా అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 19 రాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసి ఈ వాహనాలతో అనుసంధానించారు. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ వన్యప్రాణుల విషయంలో తనకు ఉన్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. మొన్న ఆమధ్య తన తల్లి అంజనా దేవి జన్మదినం నాడు విశాఖ జూలో ఒక జంతువు సంరక్షణకు సంబంధించి దత్తత తీసుకున్నారు ఏడాది పాటు. ఇప్పుడు ఏకంగా వన్యప్రాణుల కోసం అంబులెన్స్ లు ఏర్పాటు చేయడం విశేషం.