AP Deputy CM Pawan Kalyan : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఢిల్లీ వెళ్లిన పవన్.. కొద్దిసేపట్లోనే తన పర్యటనను ముగించుకున్నారు. తిరిగి విజయవాడ చేరుకున్నారు. ఏపీలో తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో పవన్ అమిత్ షా ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని విపక్షం ప్రచారం చేస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టు జరుగుతోంది. వారిపై కేసులు కూడా నమోదు అవుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లడం, కేవలం హోం మంత్రి అమిత్ షాను కలిసి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పటినుంచి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి ఆయన ఢిల్లీ వెళ్లినట్లు వైసిపి అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. మరోవైపు దక్షిణాదిన బిజెపి బలోపేతం బాధ్యతలు పవన్ పై పెట్టారని కూడా టాక్ నడుస్తోంది. అయితే ఇంతలా ఊహాగానాలు వస్తున్న పవన్ మాత్రం ఎక్కడా ప్రకటన చేయలేదు. అమిత్ షా తో జరిగిన చర్చల వివరాలను బయట పెట్టలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది. మహారాష్ట్రలో బిజెపికి అనుకూలంగా ప్రచారం చేయాలని అమిత్ షా పవన్ ను కోరినట్లు తెలుస్తోంది. త్వరలో మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపి గెలుపు కీలకంగా మారనుంది. అక్కడ ప్రతికూల ఫలితాలు వస్తే బిజెపికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అందుకే కేంద్ర పెద్దలు మహారాష్ట్ర పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా మిత్రుల సాయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ను అమిత్ షా పిలిచి మాట్లాడారని తెలుస్తోంది. ముంబైలో తెలుగు వాళ్ళు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేయాలని పవన్ ను కోరినట్లు సమాచారం. అందుకు పవన్ సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
* పవన్ చొరవతో కూటమి
ఏపీలో మూడు పార్టీలు కూటమి కట్టడం వెనుక పవన్ కళ్యాణ్ కృషి ఉంది. మూడు పార్టీల కలయికతో ప్రభంజనం సృష్టించగలిగారు. మున్ముందు మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆశాభావంతో ఉన్నారు. చంద్రబాబుకు సైతం కావాల్సింది అదే. అందుకే నిన్న మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రత్యేక విమానంలో పవన్ ఢిల్లీ బయలుదేరారు. నేరుగా అమిత్ షాను కలిశారు. కేవలం అరగంటలో తన పర్యటనను ముగించారు. అమిత్ షా తో కీలక చర్చలు జరపడమే కాదు.. ఆయన అభిప్రాయాలను సైతం తీసుకున్నారు. వెంటనే విజయవాడబయలుదేరారు పవన్ కళ్యాణ్. అయితే అమిత్ షా తో ఏం చర్చించారు అన్నది మాత్రం క్లారిటీ లేదు.
* మహారాష్ట్రలో పవన్ ప్రచారం
అయితే త్వరలో మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. శివసేనతో పాటు ఎన్సిపి తిరుగుబాటు వర్గంతో కలిసి బిజెపి ముందుకు వెళ్లనుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఈ తరుణంలోనేఅక్కడ బిజెపి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. మహారాష్ట్రలో తెలుగు ఓటర్లు అధికం. ముంబై తో పాటు నాసిక్, నాందేడ్, నాగపూర్ వంటి ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు ఉన్నారు. వారికోసం ప్రచారం చేయాలని పవన్ అడిగినట్లు చెబుతున్నారు. దీనికి పవన్ సైతం అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే మహారాష్ట్రలో బిజెపి తన స్టార్ క్యాంపైనర్ల జాబితాను ప్రకటించింది. పవన్ అంగీకరిస్తే ఒకరోజు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇప్పటివరకు బిజెపి కానీ.. జనసేన కానీ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.