YCP: అక్కడ పోటీ చేయలేం.. చేతులెత్తేసిన వైసిపి

ఈ ఎన్నికల్లో వైసిపి దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో పార్టీకి భవిష్యత్తు లేదనుకుంటున్న నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది వైసిపి.

Written By: Dharma, Updated On : November 7, 2024 3:59 pm

YCP Leaders

Follow us on

YCP: వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరించింది. మార్చిలో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార టిడిపి ఇక్కడ అభ్యర్థులను ప్రకటించింది. కృష్ణా- గుంటూరు జిల్లాల పట్టభద్రుల స్థానానికి మాజీ మంత్రి ఆలపాటి రాజాను అభ్యర్థిగా ప్రకటించింది. ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పేరాబత్తుల రాజశేఖర్ పేరును ఖరారు చేసింది. ఇప్పటికే టిడిపి అభ్యర్థులు ప్రచారం కూడా ప్రారంభించారు. మూడు పార్టీల సమన్వయ కమిటీ సమావేశాలను సైతం ఏర్పాటు చేశారు. మరోవైపు వైసీపీ సైతం కృష్ణా-గుంటూరు స్థానానికి గౌతమ్ రెడ్డి పేరును ప్రకటించింది. అయితే ఇంతలో ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు చెప్పడం విశేషం. ఓవైపు పార్టీ నుంచి నేతలు గుడ్ బై చెప్పడం, మరోవైపు పోటీకి నేతలు ముందుకు రాకపోవడం తదితర కారణాలతో వైసిపి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కనీసం పోటీ చేస్తే డిపాజిట్లు వస్తాయా లేదా అన్న ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది. పైగా కూటమి అధికారంలోకి వచ్చి కేవలం ఐదు నెలలు మాత్రమే అవుతోంది. ప్రజలు ఆలోచించే సమయం కూడా లేదు. ప్రభుత్వ పాలనకు ఈ ఐదు నెలల సమయం సరిపోదు. ఈ కారణాలతోనే వైసిపి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

* ఆ నమ్మకం లేకేనంటున్న నేతలు
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఏ చిన్న పోస్ట్ పెట్టినా పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. దీనినే సాకుగా తీసుకుంది వైసిపి. ఈ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందని నమ్మకం లేక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. పార్టీలో అందరి అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

* టిడిపికి ఏకపక్షమేనా?
మరోవైపు ఇప్పటికే టిడిపి తన అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్ని కంటే వామపక్షాలు తప్పకుండా రంగంలో ఉంటాయి. అయితే టిడిపి అభ్యర్థులకు మూడు పార్టీల మద్దతు ఉంది. దీంతో అక్కడ గెలుపు నల్లేరు మీద నడకేనని తెలుస్తోంది. మరోవైపు విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పై మండలి చైర్మన్ మోసేన్ రాజు అనర్హత వేటు వేశారు. దీంతో అక్కడ ఎన్నికకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. ఇంతలోనే హైకోర్టు తీర్పు ఇచ్చింది. మండలి చైర్మన్ మోసేన్ రాజు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. తిరిగి రఘురాజును ఎమ్మెల్సీగా కొనసాగడానికి అవకాశం ఇచ్చింది. అయితే ఇలా వరుస పరిణామాలతో వైసిపికి షాక్ లు తగులుతున్నాయి.