Homeఆంధ్రప్రదేశ్‌Kunkee Elephents  : రైతుల కోసం అదిరిపోయే ఐడియా.. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తెప్పిస్తున్న...

Kunkee Elephents  : రైతుల కోసం అదిరిపోయే ఐడియా.. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తెప్పిస్తున్న డిప్యూటీ సీఎం పవన్*

Kunkee Elephents : గత కొన్ని సంవత్సరాలుగా ఏనుగులు కొన్ని ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. పంటలకు నష్టం చేకూరుస్తున్నాయి. ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఏ ప్రభుత్వం వాటిని నియంత్రించే ప్రయత్నం చేయలేదు. కేవలం వాటి రాకను తెలియజేసి అలర్ట్ చేశారు తప్ప.. వాటిని పూర్తిగా తరలించే ప్రయత్నం చేయలేదు. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినప్పుడు తూతూ మంత్రంగా సాయం పంపిణీ చేసి ప్రభుత్వాలు చేతులు దులుపుకునేవి. ప్రధానంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏనుగులు సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. లఖేరి అటవీ ప్రాంతాల నుంచి వచ్చిన ఏనుగులు తిష్ట వేశాయి. రెండు జిల్లాల్లో సంచరిస్తూ ప్రజా జీవనానికి ఆటంకం కలిగిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో సైతం ఇదే పరిస్థితి ఉంది. ఏనుగుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ప్రజల ఇబ్బందులను తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఏనుగుల వల్ల పంటల ధ్వంసం, రైతులకు వస్తున్న సమస్యలపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. దీనికోసం పరిష్కార మార్గం అన్వేషించారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకొచ్చి.. సత్వర చర్యలకు ఉపక్రమిస్తామని వివరించారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి వాటిని తీసుకురానున్నట్లు వివరించారు.అక్కడి అధికారులతో తానే చర్చలు జరుపుతానని.. రిక్వెస్ట్ చేస్తానని కూడా పవన్ చెప్పుకొచ్చారు. వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా విద్యుత్ ఫెన్సింగ్ వేసుకునే విధానాలు విడిచి పెట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కూడా పవన్ సూచించారు. అది చట్ట ప్రకారం నేరం అన్న విషయాన్ని వివరించాలన్నారు. వన్యప్రాణుల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు ఎంతటి కఠిన చర్యలు కైనా దిగుదామని అధికారులకు పవన్ స్పష్టం చేశారు.

* వీటి ప్రత్యేకత ఇదే
కుంకీ ఏనుగులు అనేవి ప్రత్యేకంగా ఉంటాయి. వీటికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. అటవీ ప్రాంతాలకు దగ్గర్లో ఉన్న గ్రామాలపై, పంట పొలాలపై ఏనుగులు దాడి చేస్తుంటాయి. ఆ సమయంలో ఏనుగులను తరమడం ప్రమాదకరం. అది సాధ్యం కాదు కూడా. వాటిని తరమడానికి ఇలా శిక్షణ పొందిన ఏనుగులను ఉపయోగిస్తారు. వీటినే కుంకీ ఏనుగులుగా పిలుస్తారు. ఏపీలో జయంత్, వినాయక అనే రెండు ఏనుగులు అందుబాటులో ఉన్నాయి. చిత్తూరు జిల్లా కౌండిన్య అడవుల్లోని ననియాల సంరక్షణ కేంద్రంలో వీటిని ఉంచారు.

* ఎంపికలో జాగ్రత్తలు
కుంకీ ఏనుగుల ఎంపికలో కూడా చాలా రకాల జాగ్రత్తలు అవసరం.
మగ ఏనుగులను మాత్రమే కుంకీలుగా ఎంచుకుంటారు.మగ ఏనుగులు మాత్రమే ఒంటరిగా తిరుగుతుంటాయని వాటిని ఎంపిక చేస్తారు. ఆడ ఏనుగుల మంద పంట పొలాల పై దాడి చేసిన సమయంలో కుంకీగా ఉండే మగ ఏనుగు రాగానే అక్కడ నుంచి తప్పుకుంటాయి. కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉన్న మగ ఏనుగులు పంటలపై దాడి చేస్తే.. వాటిని తరిమికొట్టడం కుంకీలకు, అటవీ శాఖ అధికారులకు కాస్త కష్టంగానే ఉంటుంది. ఆ సమయంలో వాటితో గట్టిగానే పోరాటం చేయాల్సి ఉంటుంది. అడవిలో తిరిగే ఏనుగును కుంకీగా మార్చడానికి శిక్షణ కూడా ముఖ్యం. ఈ శిక్షణ చాలా కష్టతరం కూడా. అటువంటి కుంకీ ఏనుగులను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం.

* పవన్ బాధ్యతలు తీసుకున్నాకే..
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తో పాటు ఆరు ప్రధాన శాఖలను తీసుకున్నారు. అందులో అటవీ శాఖ ఉంది. పర్యావరణ పరిరక్షణ శాఖ కూడా ఉంది. అందుకే రాష్ట్రంలో వన్యప్రాణులతో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించారు. అదే సమయంలో వన్యప్రాణులను సంరక్షించాలన్న గురుతుర బాధ్యతను కూడా ప్రజలకు గుర్తు చేస్తున్నారు. అందులో భాగంగానే కుంకీ ఏనుగులను రప్పించి శాశ్వత పరిష్కార మార్గం చూపించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆపరేషన్ త్వరలో ప్రారంభమవుతుందని అటవీ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version