Cyclone Montha Effect: ఏపీలో( Andhra Pradesh) మొంథా తుఫాను వణుకు పుట్టించింది. రాష్ట్రం చిగురుటాకుల వణికిపోయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ పెను విపత్తు తీరం వైపు వచ్చే క్రమంలో ప్రతిక్షణం భయం భయమే. ఒకవైపు భారీ ఈదురుగాలులు, ఇంకోవైపు కుండపోతగా వానలు, మరోవైపు ఉవ్వెత్తున ఎగసిపడే రాకాసి అలలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేశాయి. శ్రీకాకుళం జిల్లా డుంకూరు నుంచి తిరుపతి జిల్లా తడ వరకు బంగాళాఖాతంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఎక్కడికక్కడే సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. దీంతో తీర ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. చాలాచోట్ల తీరం కోతకు గురైంది. ప్రతి జిల్లాలోని తీరప్రాంతాల్లో ఇది స్పష్టంగా కనిపించింది.
Also Read: రవితేజ వల్లే మా తమ్ముడు కార్తీ కెరియర్ నిలబడింది : సూర్య…
* అల్లకల్లోలంగా సముద్రం..
తుఫాన్ దాటికి కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. తాళ్లరేవు( Thala revu ) నుంచి తొండంగి వరకు తీరం వెంబడి అలలు ఉవ్విత్తిన ఎగసిపడ్డాయి. తుఫాన్ తీరానికి సమీపిస్తున్న కొద్ది సముద్రంలో అలజడి మరింత తీవ్రంగా మారింది. తీరం వెంబడి రాళ్లగుట్టలు ఉన్నచోట ఎనిమిది నుంచి పది అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంతంలో సైతం ఇదే పరిస్థితి ఎదురయింది. విశాఖ లో సైతం అలలు ఎగసి పడటం, సముద్రం ముందుకు రావడం వంటి కారణాలతో బీచ్ ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. అటువైపుగా పర్యాటకులను రానివ్వలేదు. ఉప్పాడ మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అర కిలోమీటర్ దూరం వరకు సముద్రపు అలల శబ్దం వినిపించడంతో మత్స్యకారులు భయపడిపోయారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి చూడలేదని చెబుతున్నారు. తీరానికి చెంతనే ఉన్న వందలాది గ్రామాలకు సముద్రపు నీరు చుట్టుముట్టింది. దీంతో అధికారులు మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
* మత్స్యకార మహిళల పూజలు..
సముద్రుడి ఉగ్రరూపం చూసి తీర ప్రాంతం వెంబడి మత్స్యకారులు( fisheries) తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గతంలో చాలా విపత్తులు చూసామని.. ఏకకాలంలో వాన, ఈదురు గాలులు ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. అయితే ముందస్తు హెచ్చరికల విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా, తీవ్ర తుఫాన్ గా మారిన క్రమంలో ఏపీ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తం అయ్యింది. ముందుగా మత్స్యకారులను అప్రమత్తం చేసింది. అప్పటికే చేపల వేటకు వెళ్లిన వారిని తీరానికి చేర్చింది. అయితే సముద్రం అల్లకల్లోలంగా మారిన క్రమంలో ఎక్కడికక్కడే మత్స్యకార మహిళలు పూజలు చేశారు. సముద్రుడు ఉగ్రరూపం నుంచి శాంతించాలని కోరుతూ తీరం వద్దకు వచ్చి మహిళలు పూజలు చేయడం కనిపించింది. అయితే తీరానికి తుఫాన్ తాకిన క్రమంలో 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. మధ్యాహ్నం కి మరింత తగ్గుతాయని.. సాయంత్రానికి యధాస్థితికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికైతే సముద్రుడి ఉగ్రరూపంతో మత్స్యకారులు బెంబేలెత్తిపోయారు.