Fengal Cyclone : ఏపీకి మరో తుఫాన్ హెచ్చరిక.ఫెంగల్ తుఫాను ప్రభావం నుంచి పూర్తిగా బయటపడక ముందే ఏపీకి మరో హెచ్చరిక జారీ అయింది. ఈనెల 6న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెబుతోంది. దీంతో ఒక్కసారిగా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. అయితే ఫెంగల్ తుఫాను ప్రభావం ఏపీ పై అంతంతమాత్రంగా పడింది. కానీ తాజాగా అల్పపీడనం వాయుగుండం గా మారి తుఫానుగా పరిణమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం ఏపీ పై అధికంగా ఉంటుందని తెలుస్తోంది.ఈ హెచ్చరిక రావడంతో ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఒకవైపు వరి కోతలతో రైతులు బిజీగా ఉన్నారు.కోతలకు అదును దాటుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.ఇంకోవైపు మత్స్యకారులు వేటకు దూరమయ్యారు.
* రెండు రోజుల్లో స్పష్టత
అయితే తాజా తుఫానుపై రెండు రోజుల్లో స్పష్టత రానుంది.ఫెంగల్ తుఫాను బలహీన పడింది. తీవ్ర అల్పపీడనంగా మారి మంగళవారం అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. అయితే తుఫాను ప్రభావంతో సముద్రం నుంచి భారీగా తేమ రావడంతో తమిళనాడు, దానికి ఆనుకొని ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. నేటితో పాటు రేపు కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
* ఆ రెండు జిల్లాలకు నష్టం
మొన్నటి తుఫానుతో నెల్లూరు తో పాటు చిత్తూరు జిల్లాకు అపార నష్టం కలిగింది.వేలాది హెక్టారుల్లో పంటకు నష్టం వాటిల్లింది.నెల్లూరు చెన్నై మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే ఆ తుఫాను భయం వీడక ముందే మరో తుఫాను హెచ్చరిక రావడం ఏపీలో ఆందోళన నెలకొంది.అయితే ఈ తుఫానుపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది.