Cyber Crimes: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎప్పుడూ ఎవరో ఒకరు మోసగాళ్ల బారిన పడుతున్న వార్తలు వింటూనే ఉన్నాం. ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గతేడాది సైబర్ మోసగాళ్లు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఏకంగా రూ.22,845 కోట్లను అక్రమంగా దోచుకున్నారు. ఇది ఏపీ రాజధాని అమరావతి కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతున్న దాని కంటే ఎక్కువ. 2023లో సైబర్ నేరాల వల్ల రూ.7465 కోట్ల నష్టం జరగ్గా, 2024లో ఇది ఏకంగా 206 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ పెరుగుదల సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎంతగా పెరిగిపోయాయో తెలియజేస్తోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్‌సభలో మాట్లాడుతూ.. నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(NCRP), హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(CFCFRMS)లో మొత్తం 36.40 లక్షల ఆర్థిక మోసాల కేసులు నమోదయ్యాయని తెలిపారు.
Also Read: చంద్రబాబు ఆపడు.. ట్రోలర్స్ వదలరు..
2023లో ఆర్థిక మోసాలకు సంబంధించి 24.4 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యను బట్టి చూస్తే ప్రతేడాది ప్రజలు మోసపోతున్న ఘటనలు పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది. NCRPలో నమోదైన మొత్తం సైబర్ నేరాల కేసుల సంఖ్యను పరిశీలిస్తే, 2024లో 22.7 లక్షల కేసులు నమోదయ్యాయి. కాగా, 2023లో ఈ సంఖ్య 15.9 లక్షలు మాత్రమే. ఇది ఏకంగా 42 శాతం పెరుగుదలను సూచిస్తోంది. ఇది నిజంగా షాకింగ్ విషయమే. ఈ గణాంకాలు సైబర్ సేఫ్టీ పట్ల మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తున్నాయి.
సైబర్ నేరాలను అరికట్టడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. NCRPను 2019లో ప్రారంభించింది. ఆర్థిక మోసాలను వెంటనే నివేదించడానికి, మోసగాళ్లు డబ్బును దారి మళ్లించకుండా నిరోధించడానికి ప్రభుత్వం 2021లో సీఎఫ్సీఎఫ్ఆర్ఎంను ప్రారంభించారు. సీఎఫ్సీఎఫ్ఆర్ఎం ఇప్పటివరకు 17.8 లక్షలకు పైగా ఫిర్యాదులలో రూ.5489 కోట్లకు పైగా డబ్బును కాపాడగలిగింది. అంటే, మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బును తిరిగి పొందడానికి అవకాశం ఉంది.
Also Read: వైసీపీ ఎమ్మెల్సీ చుట్టూ ఉచ్చు.. కేసు రీ ఓపెన్!
సైబర్ నేరగాళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. పోలీస్ అధికారుల సమాచారం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 9.42 లక్షలకు పైగా సిమ్ కార్డులను, 2,63,348 ఐఎంఈఐ నంబర్‌లను బ్లాక్ చేసింది. పోలీసులు ఇప్పటివరకు 10,599 మంది నిందితులను అరెస్టు చేశారు. సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద లింకులు, ఈమెయిల్‌లకు దూరంగా ఉండాలి. స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు, 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉపయోగించాలి. సురక్షిత వెబ్‌సైట్‌లను (https) మాత్రమే ఓపెన్ చేయాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేయవద్దు. సాఫ్ట్‌వేర్, డివైజ్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. పబ్లిక్ వై-ఫై ఉపయోగించవద్దు. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా సైబర్ మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.