YCP Anantha Babu Driver Case: ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) నేతలు కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మద్యం కుంభకోణం కేసులు ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్టుతో సరికొత్త సంకేతాలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. కీలక నేతను సైతం అరెస్టు చేసేందుకు వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని సంకేతాలు పంపింది. ఈ కేసుకు సంబంధించి తొలి విడత చార్జ్ షీట్ దాఖలు చేసింది. పలుమార్లు మాజీ సీఎం జగన్ ప్రస్తావన తీసుకొచ్చింది. మరోవైపు టిడిపి అనుకూల మీడియాలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదని.. ఆయన తప్పు చేశారని వరుసగా కథనాలు వస్తున్నాయి. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఆయన అరెస్టు తప్పదని ప్రచారం నడుస్తోంది. ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకున్నారు ఏపీ పోలీసులు. దీంతో ఈ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది.
అప్పట్లో సంచలనం..
2022లో ఎమ్మెల్సీ అనంత బాబు( MLC anantababu ) కారు డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యారు. హత్య చేసి ఆయన మృతదేహాన్ని ఇంటికి పార్సిల్ చేశారు. ఈ కేసులో అనంత్ బాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తానే హత్య చేసినట్లు ఆయన పోలీస్ విచారణలో ఒప్పుకున్నారు కూడా. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఈ కేసు నీరుగారింది. అనంతబాబు బెయిల్ పై బయటకు వచ్చారు. కేవలం వైసీపీ తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. కానీ యధావిధిగా అనంతబాబు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అయితే అప్పట్లో ఈ కేసు నీరుగార్చింది వైసిపి ప్రభుత్వం. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ప్రత్యేక ఫోకస్ చేసింది.
Also Read: పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి టీడీపీ ఎమ్మెల్యే ‘కొలిపూడి’ రచ్చరచ్చ
కోర్టు అనుమతి..
వాస్తవానికి ఈ కేసు ఎన్నికల్లో విపక్షాలకు ప్రచార అస్త్రంగా మారింది. చనిపోయిన డ్రైవర్ దళితుడు. దీంతో దళితుడి మృతదేహాన్ని పార్సిల్ చేసి పంపుతారా అంటూ విపక్షాలు ఎన్నికల్లో ప్రచారంగా మార్చుకున్నాయి. ఈ అంశం ఎస్సీల్లో వ్యతిరేకత పెంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై. రంపచోడవరం( Rampa Chodavaram ) లాంటి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ గెలిచింది తక్కువ. కానీ అనంతబాబు వ్యవహారం అక్కడ పార్టీకి డ్యామేజ్ చేసింది. టిడిపి అభ్యర్థి గెలిచేందుకు దోహద పడింది. అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంత బాబు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. కేసు దర్యాప్తునకు సంబంధించి కోర్టు అనుమతి పొందింది. కోర్టు అనుమతించడంతో అనంతబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. మూడు నెలల్లో విచారణ పూర్తి చేసే అవకాశం ఉంది. చూడాలి అనంతబాబును ఎలా దోషిగా నిలబెడతారో..