False Stories : పత్రికల్లో అసత్య కథనాలపై న్యాయస్థానం సీరియస్ గా స్పందించింది. నెల్లూరు జిల్లాలో ఏకంగా నలుగురు ఈనాడు రిపోర్టర్లపై క్రిమినల్ కేసులకు ఆదేశించింది. నిరాధారమైన ఆరోపణలతో కథనాలు రాసినందుకు సీరియస్ అయ్యింది. జగన్ సర్కారుపై ఈనాడులో వరుస కథనాలు వస్తున్నాయి. ప్రధాన సంచికతో పాటు జిల్లా ఎడిషన్లలో సైతం వ్యతిరేక కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో నెల్లూరు అర్భన్ డెవలప్ మెంట్ ఆథారిటీ (నుడా)లో అవకతవకలపై నలుగురు విలేఖర్లు సంయుక్తంగా కథనం రాశారు. అయితే అది నిరాధారమని.. అసత్య కథనం అంటూ అప్పటి నుడా వీసీ కోర్టును ఆశ్రయించారు. తుది విచారణలో భాగంగా కోర్టు ఏకంగా క్రిమినల్ కేసులకు ఆదేశించడం విశేషం.
2022 మేలో ఈనాడులో నుడ.. ఏంటీ గడబిడ అంటూ ఓ కథనం వచ్చింది. నెల్లూరు అర్భన్ డెవలప్ మెంట్ ఆథారిటీ పరిధిలో వేస్తున్న లేఅవుట్లకు సంబంధించి అనుమతుల కోసం నిర్వాహకుల నుంచి లక్షలాది రూపాయలను అక్రమంగా వసూలు చేస్తున్నారన్నది కథనం సారాంశం.ఉన్నతాధికారి పై ఫిర్యాదుచేస్తున్నా పట్టించుకోవడం లేదని కథనంలో పేర్కొన్నారు. అయితే ఇది నిరాధారమైన కథనమని.. అంతా అసత్యాలు వల్లించారని.. తాను దళితుడునైనందునే టార్గెట్ చేశారంటూ వీసి రమేష్ నెల్లూరు జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్పందించి ఏకంగా క్రిమినల్ కేసులకు జిల్లా పోలీస్ శాఖకు ఆదేశించడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ఈనాడు, ఆంధ్రజ్యోతిలో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. పాలనా వైఫల్యాలతో పాటు శాఖల్లో అవినీతిని ప్రస్తావిస్తూ లోతైన విశ్లేషణలతో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పుడు యాజమాన్యాలను విడిచి కేవలం కథనాలు రాస్తున్న విలేఖర్లపై కేసు నమోదుచేయడం విశేషం. యాజమాన్యాలు కఠినంగా ఉండడంతో అందులో పనిచేస్తున్న విలేఖర్లకు బెరించేందుకేనన్న టాక్ ఉంది. ప్రస్తుతం ఉన్న పత్రికల్లో ఈనాడుకు తెలుగునాట బలమైన నెట్ వర్క్ ఉంది. వ్యతిరేక కథనాల ప్రచురణలో వారిది ప్రత్యేక శైలి కూడా. శూల శోధన చేయడంలో కూడా ముందుంటారు. అందుకే నెట్ వర్క్ ను వెనక్కి తగ్గిస్తే..ఆటోమేటిక్ గా యాజమాన్యం వెనక్కి తగ్గుతుందని వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం జగన్, రామోజీరావు మధ్య యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. మార్గదర్శి కేసులతో రామోజీరావుపై పట్టుబిగించాలని జగన్ చూస్తుండగా… జగన్ సర్కారుపై వ్యతిరేక కథనాలు రాసి ప్రజల్లో పలుచన చేయ్యాలని రామోజీరావు చూస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో ఈనాడులో పనిచేసే విలేఖర్లు అడ్డంగా బుక్కవుతున్నారు. యాజమాన్యాలు ఇచ్చిన టాస్కు పూర్తిచేయకపోతే ఉద్యోగానికి ఎసరు. అలాగని చేస్తే కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే నెల్లూరు కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి తప్పుడు కథనాలుపై కేసులు ముమ్మరమయ్యే చాన్స్ ఉంది. అటు రామోజీరావుపై నేరుగా కోర్టులో కేసులు వేయడానికి అధికార పార్టీ నేతలు సిద్ధపడుతున్నట్టు సమాచారం.