Coalition in AP : ఏపీలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమా? ఎన్నడూ లేని విధంగా ఇటీవల సంకీర్ణం అన్న మాట అన్ని రాజకీయ పక్షాల నుంచి వినిపిస్తోంది. అది కూడా కూటమి కట్టనున్న పార్టీల నేతలే ఎక్కువగా సౌండ్ చేస్తున్నారు. ఇప్పటివరకూ సంకీర్ణమన్న మాట లేదు. పొత్తులు కుదుర్చుకున్న పార్టీల మధ్య సీట్ల పంపకాలు.. అధికారంలోకి వచ్చిన తరువాత ఒకటి, రెండు మంత్రి పదవులు ఇచ్చేవారు. కానీ పవర్ షేరింగ్ అనే మాట వినిపించేది కాదు. 2014లో టీడీపీ, బీజేపీ కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. కానీ ఎక్కడా సంకీర్ణమన్న మాట లేదు. కేంద్రంలో ఒక మంత్రి పదవి తీసుకున్న టీడీపీ.. రాష్ట్రంలో మాత్రం రెండు మంత్రి పదవులను బీజేపీకి ఇచ్చింది.
రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి నడవాలనుకుంటున్నాయి. బీజేపీని తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్నాయి. కానీ ఆ పార్టీ నుంచి ఇప్పటివరకూ స్పష్టత లేదు. అయితే టీడీపీతో బీజేపీ కలవాలని కోరుకుంటున్న సీఎం రమేష్ లాంటి వారు మాత్రం వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని తేల్చేశారు. టీడీపీతో పొత్తు కుదురుతుందని చెప్పాల్సింది పోయి సంకీర్ణం అన్న మాటను ఆయన వాడడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆయన చంద్రబాబుకు నమ్మిన బంటు. చంద్రబాబు సీఎం కావాలని బలంగా కోరుకుంటారు. అటువంటి నేతే సంకీర్ణం అన్న మాటతో సరిపోల్చడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
జనసేనలో కూడా ఒక వాయిస్ బలంగా బయటకు వస్తోంది. పవన్ సీఎం కావాలని జన సైనికులు బలంగా కోరుకుంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబు ప్రత్యేక ప్రకటనతో పవన్ సీఎం కావాలన్న వాయిస్ ను ప్రత్యేకంగా పంపించే పనికి పూనుకున్నారు. బీజేపీతో జనసేన ఇప్పటికే పొత్తులో ఉంది. ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువ. టీడీపీతో కలిస్తేనే ఏదైనా జరిగేది. మరి టీడీపీతో పొత్తు ఉంటే ఆ పార్టీ నుంచి చంద్రబాబు సీఎం అవుతారు. ఆయన తరువాత లైన్ లో లోకేష్ ఉంటారు.మరి మధ్యలో పవన్ కూడా సీఎం అని నాగబాబు అంటున్నారు అంటే కూటమి ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పకనే చెబుతున్నారు అంటున్నారు. అలా అయితేనే జనసేన పాలన కూడా జనాలు చూసే ఛాన్స్ ఉంది.
పొత్తు వేరు, సంకీర్ణం వేరు. ఎన్నికల వరకూ పొత్తు కొనసాగుతోంది. సంకీర్ణమంటే కలిసి అధికారం పంచుకోవడం అన్నమాట. ఇప్పుడు బీజేపీ, జనసేన నేతల వరుస చూస్తుంటే సంకీర్ణానికి ఫిక్సవుతున్నారన్న మాట. అంటే సీట్లు గట్టిగానే అడుగుతారన్న మాట. ఇది టీడీపీకి ప్రాణ సంకటంగా మారింది. 2014లో టీడీపీతో పొత్తు ఉన్నపుడు బీజేపీ ఎన్ని సీట్లు ఇస్తే అవి తీసుకుని సర్దుకుపోయేది. కానీ ఇపుడు మాత్రం అలా కాదు ఎక్కువ సీట్లను బీజేపీ కూడా డిమాండ్ చేయనుంది అని అంటున్నారు. తమ బలం ఎంత ఉంది అన్నది పక్కన పెడితే ఒంటరిగా పోటీ చేసేందుకు జంకుతున్న టీడీపీ బలహీనతనే అవకాశంగా మార్చుకుని ఎక్కువ స్థానాలకు పోటీ పడాలన్నదే బీజేపీ ఎత్తుగడ అని అర్ధం అవుతోంది.
అయితే బీజేపీ కోరిక అక్కడితో నిలిచిపోయేలా లేదు. జనసేనకు సీఎం షేరింగ్ ఇప్పించేందుకు కూడా గట్టిగా ఒత్తిడి తెస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జనసేన కూడా బీజేపీతో స్నేహం వదలకపోవడానికి ఇదే కారణం అంటున్నారు. ఒంటరిగా తాముగా టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటే సీట్ల తో పాటు సీఎం సీటు షేరింగ్ దగ్గర పెద్దగా డిమాండ్ చేసేందుకు బలం చాలదని జనసేన భావిస్తోంది. ఆ పని బీజేపీ ద్వారా చేయాలన్నదే జనసేన అభిమతంగా తెలుస్తోంది. మొత్తానికైతే సంకీర్ణం అన్న మాటను ఉపయోగించి బీజేపీ, జనసేనలు టీడీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.