CM Revanth Reddy: గంజాయి, డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ కేసుల్లో ఎంతటి ప్రముఖులు ఉన్నా, స్టార్ సినీ సెలబ్రిటీలు ఉన్నా ఉపేక్షించొద్దని నార్కొటిక్స్ విభాగం అధికారులకు సూచించారు.డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
నార్కోటిక్స్ వింగ్‌పై సమీక్ష..
గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనలో నార్కొటిక్స్ వింగ్ సాదించిన పురోగతిపై సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు. వివిధ కేసుల పురోగతిపై సంబంధిత అధికారులు వివరాలను సీఎంకు అందించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్ధాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. మరింత యాక్టివ్‌గా పని చేయాలని సూచించారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. అక్రమ రవాణాకు చెక్ పెట్టాలన్నారు. మత్తు పదార్థాలు సరఫరా చేయాలంటే కూడా భయపడేలా చర్యలు ఉండాలన్నారు.
యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంలు..
రాష్ట్ర అవసరాల మేరకు యాంటీ డ్రగ్స్ టీంలు ఏర్పాటు చేయాలని, డ్రగ్స్ నిర్మూలనకు కోసం ఎఫెక్టివ్‌గా పనిచేసేవారిని ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వింటేనే భయపడేలా యాంటీ డ్రగ్స్ టీంలు పనిచేయాలన్నారు. తెలంగాణ నార్కొటిక్స్ బ్యూరో దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం అవసరమైన సమకూరుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలని సూచించారు.