CM Chandrababu : ఏపీలో ( Andhra Pradesh) మరో కీలక ప్రతిపాదన దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కచ్చితంగా ఇద్దరు పిల్లలు ఉండాల్సిందే. లేకుంటే మాత్రం చాన్స్ ఉండదు. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన చేశారు. కొత్త అర్హత తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు చట్టం తీసుకొస్తామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో కనీసం ఇద్దరు పిల్లలు ఉంటే కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. చట్టం చేసిన తర్వాత పిల్లలు కనే వారికి మాత్రమే ఇది వర్తించేలా.. ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు కొత్త చట్టం సిద్ధమవుతోంది. సంపద పెంపుతో పాటు పేదరికం నిర్మూలనకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
* దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుముఖం
దక్షిణాది రాష్ట్రాల్లో( South States ) జనాభా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దీంతో యువకుల సంఖ్య కూడా తగ్గింది. అందుకే పిల్లల సంతానం పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో కుటుంబ నియంత్రణ జరిగేది. ఒకరు ముద్దు.. ఇద్దరు హద్దు అన్న నినాదం బలంగా వెళ్ళింది. అయితే ఈ సంతానం తక్కువ కావడంతో క్రమేపి యువత తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. ఒక ఇంట్లో ఒకరే బాలుడు, తరువాత యువకుడు, తరువాత వృద్ధుడిగా మారుతున్నారు. ఈ తరుణంలో యువత సంఖ్య సరైన స్థితిలో లేక దాని ప్రభావం ఆదాయంపై పడుతుంది. ప్రజల తలసరి ఆదాయం తగ్గుముఖం పడుతూ వస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి అధికంగా ఉంది. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెంచేందుకుగాను.. చర్యలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే స్థానిక సంస్థల అర్హతను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త చట్టాన్ని తెరపైకి తెచ్చినట్లు చంద్రబాబు చెప్తున్నారు.
* జనాభా సంఖ్య పెరగాల్సిందే
2026 నాటికి ఏపీ( Andhra Pradesh) జనాభా 5.38 కోట్లు ఉంటుందని ఒక అంచనా. 2051 నాటికి 5.41 కోట్లకు చేరుతుందని కూడా తెలుస్తోంది. అయితే ఇది అత్యంత ప్రమాదకరంగా పేర్కొంటున్నారు చంద్రబాబు. ప్రతి జంటకు 2.1 మంది పిల్లలు జన్మిస్తే జనాభా సక్రమ నిర్వహణ సాధ్యం అవుతుందని విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగా ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు గానే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికోసం.. కొత్త చట్టం తెచ్చి ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
* ఒకప్పుడు అలా
ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల( local bodies) ఎన్నికల్లో పోటీకి అనర్హులు. కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు పిల్లలు ఉండాల్సిందేనని చట్టం తెస్తామని చెబుతుండడం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. అయితే యువత కోసమే ఈ సరికొత్త ప్రతిపాదన. యువత ఉన్న దేశాలే అభివృద్ధి బాట పడుతున్నాయి. అందుకే యువత జనాభా కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఇకనుంచి సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేషన్ చైర్మన్ లేదా మేయర్ పదవులకు పోటీ చేయాలనుకునే వ్యక్తులు కనీసం ఇద్దరు పిల్లలను కలిగి ఉండాలి.