AP Government : ఏపీ ప్రభుత్వం ( AP government)కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు.. అమలు చేసేందుకు సిద్ధపడుతోంది. అందులో భాగంగా వివాదాస్పద భూముల రి సర్వేకు రంగం సిద్ధం చేసింది. ఈనెల 20 నుంచి భూముల రి సర్వే చేపట్టేందుకు నిర్ణయించింది. వాస్తవానికి గత వైసిపి ప్రభుత్వం లోనే రీ సర్వే ప్రక్రియ జరిగింది. అప్పట్లో దీనిపై అనేక రకాల అభ్యంతరాలు వచ్చాయి. అయినా సరే వైసీపీ ప్రభుత్వం కొనసాగించింది. కానీ వాటిని సైతం పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు సర్కార్.. భూముల రీసర్వే ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించడం మాత్రం విశేషం. మొత్తం 17వేల గ్రామాలకు గాను ఏడువేలచోట్ల వైసిపి ప్రభుత్వం భూముల రీసర్వే ను పూర్తి చేయగలిగింది. ఇప్పుడు మిగతా చోట్ల సైతం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం విశేషం.
* రీ సర్వే పై విమర్శలు
ప్రధానంగా వైసిపి( YSR Congress ) హయాంలో రీసర్వే ప్రక్రియపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫోటో ముద్రించడం వివాదాస్పదం అయ్యింది. జగన్ ప్రజల భూములను బలవంతంగా లాక్కుంటారని అప్పటి విపక్షాలు చేసిన విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. మరోవైపు సరిహద్దు రాళ్లపై జగన్ ఫోటోలు ఉండడం కూడా విమర్శలకు కారణమైంది. అయితే అప్పట్లో అధికారుల తప్పిదాలతో పాటు ప్రభుత్వం అనుసరించిన విధానాల్లో కూడా లోపాలు బయటపడ్డాయి. అప్పట్లో టిడిపి, జనసేన, బిజెపి ఈ భూముల రీసర్వే ను నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి.
* ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
జగన్ సర్కార్( Jagan Sarkar) హయాంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైన సంగతి తెలిసిందే. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఉండడమే కాకుండా.. వాటి ఒరిజినల్ ప్రభుత్వం తీసుకునేందుకు సిద్ధపడింది. అప్పట్లో ప్రజల్లో విపరీతమైన ఆందోళనకు ఇది కారణమైంది. దీనినే ప్రచార అస్త్రంగా మార్చుకుంది తెలుగుదేశం పార్టీ. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే రద్దుచేసి చూపించారు. మరోవైపు వైసీపీ హయాంలో నిలిచిపోయిన భూముల రీ సర్వే ప్రక్రియను ఇప్పుడు కొనసాగించాలని నిర్ణయించడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ సర్వేకు ప్రోత్సాహకంగా 200 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అందుకే రీ సర్వే కొనసాగించక తప్పని పరిస్థితి చంద్రబాబు సర్కార్ కు ఎదురైంది.
* రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం( Alliance government). ఈ సదస్సులో వచ్చిన వినతులకు 45 రోజుల్లో పరిష్కార మార్గం చూపుతామని చెప్పుకొచ్చింది. ప్రతి ఫిర్యాదును నమోదు చేసుకుంది. పరిష్కారం చూపించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే భూముల రీసర్వే అంటే యంత్రాంగంపై తప్పకుండా భారం పడుతుంది. అయితే ఇవేవీ పట్టించుకోని ప్రభుత్వం రీ సర్వేకు సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీచేసింది. ముందుగా మండలానికి ఓ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని.. 200 నుంచి 250 ఎకరాల్లో రీసర్వ్ చేయబోతున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ భూములను వేరుచేసి సరిహద్దు రాళ్ళను ఏర్పాటు చేయనున్నారు. సర్వేలో భాగంగా భూ యజమానులతో పాటు చుట్టుపక్కన ఉన్న భూముల యజమానులకు సైతం నోటీసులు ఇస్తారు. ప్రయోగాత్మకంగా సర్వే పూర్తి చేసి.. 17వేల గ్రామాల్లో పూర్తిస్థాయి సర్వే చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.