https://oktelugu.com/

CM Chandrababu: సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు.. హుటాహుటిన హైదరాబాద్ కు!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ఈరోజు నుంచి రెండు రోజులపాటు చంద్రబాబు అక్కడ ప్రచారం చేయాల్సి ఉంది. కానీ సోదరుడి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు చంద్రబాబు.

Written By:
  • Dharma
  • , Updated On : November 16, 2024 / 01:58 PM IST

    CM Chandrababu

    Follow us on

    CM Chandrababu: సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దయింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు ఆయన. ఈరోజు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు అయ్యింది. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బిజెపి పెద్దల విన్నపం మేరకు మహారాష్ట్రలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం చేయాలని చంద్రబాబు భావించారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు డిసైడ్ అయ్యారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాదుకు రావాల్సి వచ్చింది. సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండడంతో చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ చేరుకుంటున్నారు. వాస్తవానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈనెల 18న క్యాబినెట్ మీటింగ్ కూడా జరగనుంది. ఢిల్లీలో ఓ మీడియా సంస్థ సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. పనిలో పనిగా కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. తిరిగి మహారాష్ట్ర వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడినుంచి వైద్యులతో మాట్లాడారు. సోదరుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ తన కార్యక్రమాలను రద్దు చేసుకొని హైదరాబాద్ వచ్చేశారు.

    * కుటుంబ నేపథ్యం
    రామ్మూర్తి నాయుడు చంద్రబాబుకు స్వయానా సోదరుడు. నారా ఖర్జూర నాయుడు, అమ్మనమ్మ దంపతులకు రెండో కుమారుడు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు నటుడు నారా రోహిత్. రెండో కుమారుడు గిరీష్. 1994లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రామ్మూర్తి నాయుడు. 1999 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

    * కొంతకాలంగా అనారోగ్యంతో
    గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామ్మూర్తి నాయుడు. హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తండ్రి అనారోగ్యం దృష్ట్యా నారా రోహిత్ నిశ్చితార్థ వేడుకలను స్వయంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యవేక్షించారు. కొద్ది రోజుల కిందట రోహిత్ వివాహ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. చంద్రబాబు, లోకేష్, నందమూరి బాలకృష్ణ దంపతులు నూతన వధూవరులకు ఆశీర్వాదం తెలిపారు. అయితే అప్పట్లోనే రామ్మూర్తి నాయుడు ఎక్కడా కనిపించలేదు. పెద్దమ్మ భువనేశ్వరి అన్ని తానై వ్యవహరించారు. అప్పటికే రామ్మూర్తి నాయుడు ఆసుపత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే మంత్రి లోకేష్ హైదరాబాద్ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో చంద్రబాబు కూడా రానున్నారు.