IAS Kishore Kumar: గత ఐదేళ్ల వైసిపి హయాంలో విజయనగరం జిల్లా హాట్ కేక్. ఇక్కడ పనిచేసేందుకు అధికారులు, ఉద్యోగులు క్యూ కట్టేవారు. అక్కడ ఓ కుటుంబానికి సహకరిస్తే చాలు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆపై నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చు. అలాగే వచ్చారు ఓ ఐఏఎస్ అధికారి. ఓ మూడేళ్ల పాటు జిల్లాలో ఉన్నారు. కానీ ఓ 250 ఎకరాలు రాజకీయ నేతలకు ధారాధత్తం చేశారు. 350 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని పరులపరం చేశారు. దీని వెనుక అప్పటి జిల్లా కీలక నేత కుటుంబ ప్రమేయం అధికంగా ఉండేది.ప్రస్తుతం ఆ అధికారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.అప్పట్లో జరిగిన భూ దందాకు సంబంధించిన ఆధారాలు, గతంలో ఆయన పై ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చేపట్టిన విచారణ నివేదిక కూడా బయటపడింది. దీంతో కూటమి ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ భూసంతర్పణపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.
* జెసి నిర్వాకం ఇదే
విజయనగరం జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా కిషోర్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి పనిచేశారు. అప్పట్లో మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కిన అధికారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఓ పుట్టినరోజు నాడు బొత్సకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఒక ఐఏఎస్ అధికారి తన స్థాయిని మరిచి కాళ్లకు నమస్కారం పెట్టడం ఏంటి అనేది అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు అదే అధికారి నిబంధనలకు విరుద్ధంగా 250 ఎకరాల భూమిని ఇతరులకు కట్టబెట్టడం బయటపడింది. ఈ స్వామి భక్తి వెనుక కారణం అదేనని ఇప్పుడు తేలింది. ఆ అధికారి చేసిన నిర్వాకంతో చాలామంది అధికారులపై తాజాగా వేటు పడింది.
* ఆ కుటుంబానిదే హవా
వైసిపి హయాంలో బొత్స కుటుంబాని దే హవా. ఆ కుటుంబానికి తెలియకుండా చీమ కూడా కదలని పరిస్థితి. అటువంటిది ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారంటే వారికి తెలియదా? అయితే అప్పట్లో విజయనగరం జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన సూర్యకుమారి జెసి వ్యవహార శైలిపై అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారి బాబు నేతృత్వంలో విచారణ కూడా జరిగింది.అక్రమాలు నిజమేనని తేలింది. జెసి కిషోర్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలని..వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారు.కానీ వైసీపీ జిల్లా పెద్దల కోరిక మేరకు ఆ నివేదికను తొక్కి పెట్టింది జగన్ సర్కార్. అయితే నాటి పాలకుల పాపం పుణ్యమా అని కిందిస్థాయి అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.