CM Chandrababu: చంద్రబాబు( AP CM Chandrababu) ఆలోచనలు ఎప్పుడు ముందస్తుగా ఉంటాయి. రాబోయే తరాలకు సంబంధించి ముందే ఆలోచన చేయగల శక్తి చంద్రబాబుది. ఇది గతంలో చాలా సందర్భాల్లో నిరూపితం అయింది. నాడు చంద్రబాబు ఆలోచనే సైబరాబాద్ నిర్మాణం. వేలాదిమంది దిగ్గజ నిపుణులను అందించింది సైబరాబాద్ ఐటి. నాడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను ఒప్పించి మరి ఆ కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది. అయితే అది ఊరికే రాలేదని.. దానికోసం చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. తాజాగా మద్రాస్ ఐఐటి లో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు.
* మద్రాస్ ఐఐటి పై ప్రశంస..
మద్రాస్ ఐఐటీ ( Madras IIT)ఎన్నో విషయాల్లో నంబర్ వన్ గా ఉందని కొనియాడారు. ఆన్లైన్ కోర్సులు అందిస్తుండడం శుభపరిణామం అన్నారు. ఐఐటి మద్రాస్ స్టాప్ టాప్ అగ్నికుల్ మంచి విజయాలు అందుకుందని గుర్తు చేశారు. ఇక్కడ ప్రాజెక్టులు 80% విజయవంతం అవుతున్నాయని.. అయితే ఇక్కడ 35 నుంచి 40 శాతం తెలుగు విద్యార్థులే ఉండడం శుభపరిణామం అన్నారు. 1991లో తీసుకొచ్చిన సంస్కరణలు తప్పనిసరి అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. రాజకీయ సంస్కరణలతో సోవియట్ రష్యా అనేక దేశాలుగా విడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. సంస్కరణలు కఠినంగా ఉంటాయని.. వాటిని అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు ఇస్తాయని చెప్పుకొచ్చారు చంద్రబాబు. 1990లో కమ్యూనికేషన్ రంగంలో బిఎస్ఎన్ఎల్, విఎస్ఎన్ఎల్ మాత్రమే ఉండేవని.. ఆర్థిక సంస్కరణల తర్వాత కమ్యూనికేషన్ల రంగంలో ప్రైవేటు సంస్థల రాక మొదలైందని చెప్పుకొచ్చారు చంద్రబాబు.
* అప్పట్లో ఒప్పించేందుకు ప్రయత్నం
అయితే నాడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను( Microsoft chief Bil Gates ) ఒప్పించడం చాలా ఇబ్బందికరంగా మారిందని నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. బిల్ గేట్స్ ను మొదట కలుస్తానని అడిగినప్పుడు రాజకీయ నేతల కోసం లేదని చెప్పారు. అయినా ఆయనను ఒప్పించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. 45 నిమిషాల పాటు మాట్లాడారని.. హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ సంస్థను ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. అప్పట్లో అదే సంస్థకు సీఈవోగా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల ఉన్నారని చెప్పారు. అలా మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాదులో ఏర్పాటుకు దోహదపడిందన్నారు. సంస్కరణలతో పాటు పెద్ద ప్రయత్నాలు చేసినప్పుడు కొన్ని రకాల అవరోధాలు, విమర్శలు వస్తాయని గుర్తు చేశారు చంద్రబాబు.
* విద్యార్థుల నుంచి విశేష స్పందన
మద్రాస్ ఐఐటీ( Madras IIT) విద్యార్థులను ఉద్దేశించి చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. అందరం సమిష్టిగా కృషి చేస్తే త్వరలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంగా నిలుస్తుంది అని చెప్పారు. చాలా దేశాలు జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటున్నాయని.. కానీ మనదేశంలో 40 ఏళ్ల వరకు ఈ సమస్య ఉండదన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబుకు మద్రాస్ ఐఐటీ విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో ఆయన ప్రస్తావన వచ్చినప్పుడల్లా కేరింతలు, చప్పట్లతో ఆ ప్రాంగణం మారుమోగింది.