Chokkakula Venkat Rao: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి వరుసుగా షాక్ లు తప్పడం లేదు. ఆ పార్టీకి నేతలు వరుసగా గుడ్ బై చెబుతున్నారు. ఇటీవల కాలంలో నేతల రాజీనామాలు తగ్గాయి. కానీ ఉన్నపలంగా విశాఖకు చెందిన ఓ సీనియర్ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న చొక్కాకుల వెంకట్రావు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు.
Also Read: కంచ గచ్చిబౌలి భూములు.. రేవంత్ రెడ్డికి లేచిందే పరుగు.
* పార్టీ ఆవిర్భావం నుంచి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పని చేస్తున్నారు చొక్కాకుల వెంకట్రావు( chakka Kula Venkat Rao ). అటువంటి నేత పార్టీకి గుడ్ బై చెప్పడం షాకింగ్ పరిణామం. వాస్తవానికి విశాఖ జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ నేతలు అంతా వరుసగా గుడ్ బై చెబుతూ వస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గుడ్ బై చెప్పారు. చాలా నియోజకవర్గాల్లో నేతలు సైతం రాజీనామా చేశారు. ఇప్పుడు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలు సైతం ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు. దీంతో పార్టీలో ఒక రకమైన ఆందోళన నడుస్తోంది.
* అత్యంత సీనియర్ నేత..
చొక్కాకుల వెంకట్రావు విశాఖ జిల్లాలోని( Visakha district ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేత. 2013లో విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి బిజెపి అభ్యర్థి విష్ణు కుమార్ రాజ్ చేతిలో ఓడిపోయారు. అనంతరం కొద్ది రోజులపాటు బిజెపిలో చేరారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తిరిగి ఆ పార్టీలో చేరారు. వెంకట్రావు భార్య లక్ష్మికి కీలకమైన నామినేటెడ్ పోస్ట్ సైతం దక్కింది. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ కు అధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరించారు. ఎన్నికల ఫలితాల అనంతరం చొక్కాకుల వెంకట్రావు యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యకలాపాల్లో సైతం పెద్దగా పాల్గొనడం లేదు. ఇప్పుడు ఉన్నపలంగా ఆయన పార్టీకి రాజీనామా ప్రకటించారు.
* బిజెపిలో చేరుతారని ప్రచారం..
చొక్కాకుల వెంకట్రావు బిజెపిలో( BJP) చేరుతారని ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం విశాఖ జిల్లా పై బిజెపి ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి గట్టిగానే చర్యలు చేపడుతున్నారు. మొన్న మధ్యన విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ ను బిజెపిలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చొక్కాకుల వెంకట్రావు సైతం బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.