Chittoor Mayor Couple Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు( Chittoor) నగర మేయర్ దంపతుల హత్య కేసు విచారణ కొలిక్కి వచ్చింది. ఈరోజు చిత్తూరు ప్రత్యేక మహిళా కోర్టు విచారణను పూర్తి చేసింది. కానీ ఈ నెల 27న శిక్షలు ఖరారు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పదేళ్ల కిందట చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలోనే మేయర్ అనురాధను దారుణంగా హత్య చేశారు ఆగంతకులు. కార్యాలయంలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మరోవైపు ఆమె భర్తను సైతం దాడి చేశారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. గత పది సంవత్సరాలుగా ఈ కేసు విచారణ సాగుతోంది. శుక్రవారం తుది విచారణ జరిగింది. కానీ సోమవారం శిక్షలు ఖరారు చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
* పదేళ్ల కిందట దారుణం..
2015 నవంబర్ 17న చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలోకి ఐదుగురు ఆగంతకులు ప్రవేశించారు. మేయర్ అనురాధ పై కాల్పులు జరిపారు. అప్పటికే అక్కడ కార్యాలయంలో ముగ్గురు కౌన్సిలర్లతోపాటు భర్త కటారి మోహన్ ఉన్నారు. దీంతో మోహన్ ను చూసిన ఆగంతుకులు కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారు. వెంటాడి వేటాడి పొడిచారు. కొన ఊపిరితో ఉన్న మోహన్ ను కౌన్సిలర్లతోపాటు కార్పొరేషన్ కార్యాలయ సిబ్బంది ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మోహన్ మృతి చెందారు. అప్పటినుంచి విచారణ కొనసాగుతూనే ఉంది.
* సమీప బంధువే నిందితుడు..
మేయర్ దంపతుల హత్యలో సమీప బంధువే ప్రధాన నిందితుడని పోలీసులు అనుమానించారు. మేయర్ అనురాధ భర్త మోహన్ మేనల్లుడు చింటూ హత్య చేయించాడని తేల్చారు పోలీసులు. అతనితో పాటు మరో 23 మంది నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. గత పది ఏళ్లలో ఈ హత్య కేసులో దాదాపు 122 మంది సాక్షులను విచారించారు. ఎట్టకేలకు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీనిపై సోమవారం తుది తీర్పు వెల్లడించనుంది. ఆపై నిందితులకు శిక్షలు ఖరారు చేయనుంది. అయితే తుది విచారణకు కేసు రావడంతో శుక్రవారం కోర్టు పరిసర ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు.